వినాయక మండపాలకు పోలీస్ అనుమతి తప్పనిసరి
ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయాలి
నిబంధనలకు లోబడి ఉత్సవాలు నిర్వహించాలి
రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
పెద్దపల్లి, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): ఈ నెల 14న వినాయక చవితి సందర్భంగా రామగుండము పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో గణేష్ మండపాలు ఏర్పాటు చేసి విగ్రహాలను ప్రతిష్ఠించే నిర్వాహకులు తప్పనిసరిగా పోలీస్ శాఖ అనుమతి పొందాలని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా(Amber Kishore Jha) తెలిపారు.
వినాయక విగ్రహాల ఏర్పాటు, ఉత్సవాలకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీస్ శాఖ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా నమోదు చేయాలని సూచించారు. మండపం ఏర్పాటు చేసే ప్రదేశం, సంబంధిత పోలీస్ స్టేషన్, విగ్రహం, మండపం ఎత్తు, ఉత్సవ కమిటీ సభ్యుల పేర్లు, ఫోన్ నంబర్లు, ప్రతిష్ఠాపన తేదీ తదితర వివరాలను నమోదు చేయాలన్నారు. అలాగే నిమజ్జనం తేదీ, సమయం, ప్రదేశం, నిమజ్జనానికి ఉపయోగించే వాహనం వివరాలను కూడా తప్పనిసరిగా నమోదు చేయాలని తెలిపారు.
ప్రజలు, భక్తులు భక్తిశ్రద్ధలతో వినాయక నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవాలని, మండప నిర్వాహకులు పోలీస్ శాఖ సూచించిన నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ శాంతియుతంగా, సురక్షితంగా ఉత్సవాలను నిర్వహించాలని సీపీ సూచించారు.