ప్రభుత్వ సేవలు ప్రజలకు అందుబాటులోకి...
- వాట్సాప్ ద్వారా నేరుగా ఫిర్యాదులు చేసుకునే అవకాశం
- కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల స్పోర్ట్స్: అక్టోబర్ 8 : ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు, ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించే లక్ష్యంతో రాష్ట్ర ఆబ్కారీ మద్యనిషేధ, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) ఆదేశాల మేరకు కలెక్టరేట్ లో ప్రత్యేక వాట్సాప్ నంబర్ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak) గురువారం తెలిపారు.
ప్రజలు తమ ఫిర్యాదులు, వినతులను నేరుగా వాట్సాప్ ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చని, ఇకపై ప్రభుత్వ సేవలకు సంబంధించిన ఫిర్యాదులు, సమస్యల పరిష్కారం కోసం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగవలసిన అవసరం లేకుండా, ఇంటి నుంచే వాట్సాప్ ద్వారా తమ సమస్యలను సంబంధిత అధికారులకు తెలియజేయవచ్చని తెలిపారు.
హైదరాబాద్‌లోని జిల్లా ఇన్చార్జి మంత్రి పేషీలోనూ ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని తెలిపారు. ప్రజల నుంచి అందే ప్రతి ఫిర్యాదును సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదులను సంబంధిత శాఖలకు పంపించడంతో పాటు, వాటి పరిష్కారంలో జాప్యం జరగకుండా నిరంతరం పర్యవేక్షించాలన్నారు.
ఇంచార్జ్ జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు పేషీకి 8500689596, మంచిర్యాల కలెక్టరేట్ కి (9492123642) వాట్సాప్ చేయాలని సూచించారు. పై నంబర్ కు కాల్ చేయవద్దని, కేవలం వాట్సాప్ ద్వారా తమ ఫిర్యాదులను మెసేజ్ రూపంలో పంపవచ్చని, ఫిర్యాదులో సమస్యకు సంబంధించిన పూర్తి వివరాలు, సమస్య ఉన్న ప్రదేశం, చిరునామా, అవసరమైన ఆధారాలు, సంబంధిత ఫొటోలను జత చేయాలని, తద్వారా సమస్యను గుర్తించి, సంబంధిత శాఖకు ఫిర్యాదును పంపించి పరిష్కారానికి చర్యలు తీసుకోవడం సులభతరం అవుతుందని తెలిపారు.
ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత పారదర్శకంగా, సులభంగా అందించడంతో పాటు, వారి సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపడమే ఈ ప్రత్యేక గ్రీవెన్స్ సెల్‌ల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.