పెద్దలను స్మరించి.. పూలను కొలిచిన వేళ
వెంకటాపూర్, అక్టోబర్ 10 (విజయక్రాంతి): మండలంలో శనివారం పెత్తరమావాస్య, ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు(Bathukamma Celebrations) సంప్రదాయబద్ధంగా జరిగాయి. ఉదయం పూర్వీకులను స్మరించుకుంటూ పెత్తరమావాస్య ఆచారాలను నిర్వహించిన ప్రజలు, సాయంత్రం ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. దీంతో మండలంలోని గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. పెత్తరమావాస్య సందర్భంగా ప్రజలు తమ మరణించిన తల్లిదండ్రులు, తాతముత్తాతలను స్మరించుకుంటూ బియ్యం, కూరగాయలు, వస్త్రాలు సమర్పించి సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు.
పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరాలని, వారి ఆశీస్సులతో కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. సంప్రదాయంలో భాగంగా ఆడబిడ్డలకు, బ్రాహ్మణులకు బియ్యం అందజేసి పూర్వీకుల పట్ల తమకున్న గౌరవాన్ని చాటుకున్నారు. సాయంత్రం తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగలో తొలి రోజైన ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. తంగేడు, గునుగు, బంతి తదితర రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి మహిళలు, ఆడపడుచులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.
అనంతరం బతుకమ్మల చుట్టూ చేరి సంప్రదాయ పాటలు పాడుతూ ఆటపాటలతో సందడి చేశారు. మహిళలు, చిన్నారుల కోలాహలంతో గ్రామాల్లో పండుగ శోభ సంతరించుకుంది. ఒకవైపు పూర్వీకులను స్మరించుకుంటూ పెత్తరమావాస్యను నిర్వహించడం, మరోవైపు ప్రకృతిని ఆరాధిస్తూ బతుకమ్మ వేడుకలను ప్రారంభించడం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు(Telangana culture and traditions) ప్రతీకగా నిలిచింది. పెద్దల పట్ల గౌరవం, ప్రకృతి పట్ల ఆరాధనను చాటిచెప్పే ఈ వేడుకలు గ్రామీణ జీవన విధానంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయి. ఉదయం పెద్దల జ్ఞాపకాలతో, సాయంత్రం పూల సోయగాలతో మండలంలోని గ్రామాలు పండుగ సందడితో కళకళలాడాయి.