స్మార్ట్ కిడ్జ్ లో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు

10-10-2026 | 06:35pm
  1. తీరొక్క పూల బతుకమ్మలతో ఆడి పాడిన పాఠశాల చిన్నారులు
  2. ప్రత్యేక ఆకర్షణగా పల్లకి,నెలవంక, తులసికోట బతుకమ్మలు.
  3. దసరా వేడుకలలో భాగంగా ఘనంగా రావణ దహనం 

ఖమ్మం, అక్టోబర్ 10: స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో(Smart Kidz School) శనివారం బతుకమ్మ సంబరాలు(Bathukamma celebrations) హోరెత్తాయి. పాఠశాల చిన్నారులు తమ తమ గృహాల నుంచి తీరొక్క రకాల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి ఆ బతుకమ్మలతో పాఠశాల మైదానానికి చేరుకున్నారు. పాఠశాల చిన్నారులు బతుకమ్మలన్నింటినీ పాఠశాల మైదానంలో ఉంచి బతుకమ్మల చుట్టూ వలయాకారంలో చప్పట్లు, తాళాలతో జానపద గేయాలతో నృత్యాలు చేస్తూ ఆడి పాడారు.

బతకమ్మ బతకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. పాటలతో పాఠశాల ప్రాంగణం అంతా హోరెత్తింది. ప్రత్యేకంగా తయారు చేసిన పల్లకి బతుకమ్మ, నెలవంక, తులసి కోట బతుకమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తొలుత గౌరీ మాతకు పాఠశాల చిన్నారులు ప్రత్యేక పూజలు నిర్వహించి బతుకమ్మ సంబరాలను ఆనందోత్సవాలతో నిర్వహించారు. అదేవిధంగా పాఠశాలల్లో దసరా వేడుకలను వైభవంగా, సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అమ్మవారికి మంగళకరంగా విశేష పూజలు నిర్వహించారు.

అనంతరం రావణ దహన ఉత్సవాన్ని జరిపారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య మాట్లాడుతూ ఆడపడుచులు, చెరువులు, ప్రకృతి మాత విశిష్టతను చాటిచెప్తూ, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను(Telangana culture and traditions) ప్రతిబింబిస్తూ, నిర్వహిస్తున్న బతుకమ్మ సంబరాలు ప్రపంచవ్యాప్తంగా మన తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింప చేస్తున్నాయని తెలిపారు.

పాఠశాలలో ప్రకృతి వైభవాన్ని చాటి చెప్పేందుకు, ప్రకృతిని రక్షిస్తేనే మన మనుగడ నిరంతరాయంగా వర్ధిల్లుతున్నదనే సందేశాన్ని చాటి చెప్పేందుకు పాఠశాలల్లో బతుకమ్మ సంబరాలను వేడుకగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరికి బతుకమ్మ సంబరాల శుభాకాంక్షలు, దసరా పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నమన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య, ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు