రామప్ప వారసత్వ సంపదకు పునరుజ్జీవం
వెంకటాపూర్, అక్టోబర్ 10 (విజయక్రాంతి): యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన రామప్ప దేవాలయ ప్రాంగణంలో ఉన్న కామేశ్వరాలయ పునర్నిర్మాణ ప్రక్రియలో కీలక ముందడుగు పడింది. ఆలయానికి సంబంధించిన తొలగించిన నిర్మాణ భాగాలను తిరిగి అమర్చేందుకు వీలుగా పునాది ప్రాంతంలో భూగర్భ పరిస్థితులను అంచనా వేయడానికి జియోటెక్నికల్ పరిశోధనలు నిర్వహించారు. భారత పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ) హైదరాబాద్ సర్కిల్ సాంకేతిక బృందం, హైదరాబాద్‌కు చెందిన ఎంటీఎల్ఎస్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎన్‌ఐటీ వరంగల్‌కు చెందిన రిటైర్డ్ జియోటెక్నికల్ నిపుణులు ఈ పరిశోధనల్లో భాగస్వాములయ్యారు.
పునాది పటిష్టతపై అధ్యయనం
కామేశ్వరాలయ పునాదుల పనులను ఏఎస్‌ఐ ఇటీవల రూ.2.89 కోట్ల వ్యయంతో పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో పునాది ప్రాంతంలో భూగర్భ పరిస్థితులు, నేల స్థిరత్వాన్ని అంచనా వేయడానికి సాంకేతిక పరిశోధనలు చేపట్టారు. పునాది పనుల అనంతరం భూమి సామర్థ్యాన్ని పరిశీలించడం, ఆలయ పైకట్టును తిరిగి నిర్మించేందుకు అవసరమైన సాంకేతిక అంశాలను నిర్ధారించడం ఈ పరిశోధనల ప్రధాన ఉద్దేశం.
ఐఎస్ కోడ్ ప్రమాణాలతో పరీక్షలు
పరిశోధనల్లో భాగంగా ఐఎస్ 1888, ఐఎస్ 2720 ప్రమాణాలకు అనుగుణంగా ప్లేట్ లోడ్ పరీక్షలు నిర్వహించారు. అలాగే నిర్దేశిత ప్రాంతాల్లోని కోన్ల నుంచి చెదరని మట్టి నమూనాలను సేకరించారు. ఈ పరీక్షల ద్వారా పునాది కింద ఉన్న నేల భారం మోయగల సామర్థ్యం, భూగర్భ స్థిరత్వానికి సంబంధించిన అంశాలను పరిశీలించనున్నారు. ఆలయ పునర్నిర్మాణ పనులను శాస్త్రీయంగా, సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టేందుకు ఈ పరిశోధనలు దోహదపడనున్నాయి.
పైకట్టుకు రూ.6.89 కోట్లతో ప్రతిపాదనలు
కామేశ్వరాలయ పైకట్టును తిరిగి నిర్మించేందుకు రూ.6.89 కోట్ల విలువైన టెండర్ల ఆమోద ప్రక్రియ ప్రస్తుతం పరిశీలనలో ఉంది. టెండర్ల ఆమోదం అనంతరం తదుపరి నిర్మాణ పనులకు మార్గం సుగమమయ్యే అవకాశం ఉంది. చారిత్రక, శిల్పకళా ప్రాధాన్యం కలిగిన కామేశ్వరాలయ పునర్నిర్మాణం పూర్తయితే కాకతీయుల నాటి వారసత్వ సంపద పరిరక్షణకు మరింత బలం చేకూరనుంది.