ఘనంగా 'అంగన్ మిలన్ సేవ'-'అంగన్వాడి ఉత్సవ్'
ముకరంపుర (విజయక్రాంతి): దేశ ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని చేపట్టిన 'సేవా సంకల్ప్ అభియాన్' కార్యక్రమంలో భాగంగా మంగళవారం రోజున అలుగునూర్-2 అంగన్వాడి కేంద్రంలో నిర్వహించిన 'అంగన్ మిలన్ సేవ' - 'అంగన్వాడి ఉత్సవ్' కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర హాజరై మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అంగన్వాడి కేంద్రాల సమగ్ర అభివృద్ధికి, చిన్నారుల ఉజ్వల భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేస్తోందన్నారు.
పిల్లలకు పౌష్టికాహారం అందించడంలో కేంద్రం అమలు చేస్తున్న పథకాలు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయని తెలిపారు. చిన్నారుల సంరక్షణలో, అంకితభావంతో సేవలు అందిస్తున్న స్థానిక అంగన్వాడి టీచర్ లతను సన్మానించి, వారి సేవలను కొనియాడారు. అనంతరం చిన్నారులకు బిస్కెట్లు, చాక్లెట్లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ పోలింగ్ బూత్ అధ్యక్షులు చిందం అంజి, అంగన్వాడి సిబ్బంది, పిల్లల తల్లులు తదితరులు పాల్గొన్నారు.