వర్షాభావం ఉన్నా పవర్‌ కట్‌ లేదు: భట్టి విక్రమార్క

06-10-2026 | 05:01pm

హైదరాబాద్‌: తెలంగాణలో విద్యుత్‌ డిమాండ్‌ గరిష్ఠ స్థాయికి చేరుతున్న నేపథ్యంలో ప్రభుత్వం విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) పులిచింతల జలవిద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాన్ని(Pulichintala Hydroelectric Power Station) సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డితో కలిసి అధికారులతో సమావేశమైన భట్టి, ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్‌ ఉత్పత్తి, డిమాండ్‌, సరఫరా పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ దాదాపు 20,000 మెగావాట్లకు చేరినప్పటికీ వినియోగదారులకు అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా కొనసాగిస్తున్నామని తెలిపారు. వర్షాభావ పరిస్థితుల ప్రభావంతో జలవిద్యుత్‌ ఉత్పత్తి తగ్గినప్పటికీ.. థర్మల్‌ పవర్‌తో పాటు ఇతర ప్రత్యామ్నాయ వనరులను వినియోగిస్తూ డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్‌ అందిస్తున్నామని చెప్పారు.

మరోవైపు అందుబాటులో ఉన్న నీటి వనరులను జాగ్రత్తగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని డిప్యూటీ సీఎం సూచించారు. ముఖ్యంగా తాగునీటికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విద్యుత్‌ డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో ఉత్పత్తి సామర్థ్యం, అందుబాటులో ఉన్న వనరులు, సరఫరా వ్యవస్థపై ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు అధికారులు మంత్రులకు వివరించారు.


మరిన్ని వార్తలు