రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ గౌరవించాలి

26-11-2026 | 05:20pm

మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్

హుజురాబాద్,నవంబర్ 26: (విజయక్రాంతి) భారత రాజ్యాంగం(Constitution of India) కల్పించిన హక్కులు, బాధ్యతలు, సమానత్వ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ గౌరవించాలని జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ అన్నారు. గురువారం జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన భారత రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిందని, 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని తెలిపారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నేతృత్వంలోని ముసాయిదా కమిటీ రాజ్యాంగ రూపకల్పనలో కీలక పాత్ర పోషించిందని గుర్తుచేశారు. భారత రాజ్యాంగం దేశ ప్రజలందరికీ సమాన హక్కులు, స్వేచ్ఛ, న్యాయం, సౌభ్రాతృత్వాన్ని కల్పించిందని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆశయాలను ఆచరణలో పెట్టడం ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి, గౌరవ కౌన్సిలర్లు, మేనేజర్ గుర్రాల రాజిరెడ్డి, ఏఈ వికాస్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఇల్లందుల రమేష్, వార్డు అధికారులు, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు