కరీంనగర్ పోలీస్‌కు జాతీయ గుర్తింపు

01-11-2026 | 09:52am

హత్య కేసు దర్యాప్తులో ప్రతిభ.. ఇన్‌స్పెక్టర్ శశిధర్‌రెడ్డికి కేంద్ర అవార్డు!

కరీంనగర్ క్రైం, నవంబర్ 1 (విజయక్రాంతి): విధి నిర్వహణలో అంకితభావం, నేర పరిశోధనలో వృత్తిపరమైన నైపుణ్యం కనబరిచిన కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఇన్‌స్పెక్టర్ కాసర్ల శశిధర్‌రెడ్డిని ప్రతిష్ఠాత్మక జాతీయ పురస్కారం వరించింది. హత్య కేసులో అత్యుత్తమ దర్యాప్తు నిర్వహించినందుకు ఆయనకు “కేంద్ర హోంమంత్రి దక్షతా పథకం – 2026” అవార్డు లభించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన Crime No. 155/2019 హత్య కేసు దర్యాప్తులో శశిధర్‌రెడ్డి కీలక పాత్ర పోషించారు. కేసును అన్ని కోణాల్లో విచారిస్తూ Scientific Investigation, Technical Evidence ఆధారంగా పక్కాగా ఆధారాలు సేకరించారు. వాటి ఆధారంగా పకడ్బందీగా Charge Sheet దాఖలు చేశారు. దీంతో ఈ కేసులో న్యాయస్థానంలో బలమైన ఆధారాలు సమర్పించేందుకు దర్యాప్తు బృందానికి వీలైంది.

ఈ కేసును విచారించిన కరీంనగర్ ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ కోర్టు మొత్తం 15 మంది నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అంతేకాకుండా ఒక్కొక్కరికి రూ.1,500 జరిమానా కూడా విధించింది. క్లిష్టమైన హత్య కేసులో శాస్త్రీయ ఆధారాల సేకరణ, సమర్థవంతమైన Investigation ద్వారా న్యాయస్థానంలో శిక్షలు పడేలా కృషి చేసినందుకు శశిధర్‌రెడ్డికి ఈ జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఇన్‌స్పెక్టర్ కాసర్ల శశిధర్‌రెడ్డిని శాలువాతో సత్కరించి అభినందించారు. జాతీయ స్థాయిలో అవార్డు దక్కడం కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌తో పాటు తెలంగాణ పోలీస్ శాఖకు గర్వకారణమని పేర్కొన్నారు. ఆయన సాధించిన విజయం ఇతర పోలీసు సిబ్బందికి స్ఫూర్తిగా నిలుస్తుందని ప్రశంసించారు.

మరిన్ని వార్తలు