అమలు కాని యూజీసీ నిబంధనలు
కరీంనగర్ క్రైం, నవంబర్ 23 (విజయక్రాంతి): కరీంనగర్‌లోని(Karimnagar) శాతవాహన యూనివర్సిటీలో(Satavahana University) అధ్యాపకుల అర్హతలపై(Qualifications of Teachers) మొదలైన చర్చ ఆసక్తికరంగా మారుతోంది. శాతవాహన యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగానికి చెందిన పార్ట్ టైమ్ అధ్యాపకుల(Part-time faculty) విద్యార్హతల వివరాలలో ఒకరిద్దరి వివరాలలో నెట్, సెట్, పిహెచ్ డి(NET, SET, PhD) ప్రస్తావన లేకపోవడం గమనార్హం. విశ్వ విద్యాలయాల్లో అధ్యాపక నియామకాలకు(Teacher appointments) నిర్దిష్ట అర్హతలు, ప్రమాణాలు ఉన్న నేపథ్యంలో వారి నియామకం యూజీసీ కి చెందిన ఏ నిబంధనల ప్రకారం జరిగిందన్న అంశం పలు అనుమానాలకు తావిస్తోంది.
యూజీసీ నిబంధనలు లేని నియామకాలు?
యూనివర్సిటీలో బోధనా బాధ్యతలు నిర్వహిస్తున్న అధ్యాపకుల నియామకాలకు సంబంధించి అర్హతలు, ఎంపిక విధానం, నియామక ఉత్తర్వులు వంటి వివరాలు పారదర్శకంగా ఉండాల్సి ఉంటుంది. అయితే కెమిస్ట్రీ విభాగానికి చెందిన పోస్టులకు అర్హత లేని వారిని నియమించారనీ, వారి నియామకం సమయంలో వర్తించిన నిబంధనలు ఏమిటనే ప్రశ్నలు విద్యార్థుల్లో ఉత్పన్నమవుతున్నాయి
. నెట్, సెట్, పిహెచ్డి అవసరం లేని ప్రత్యేక నిబంధనల కింద సదరు నియామకం జరిగిందా.. అలా జరిగితే ఎంపిక కమిటీ నిర్ణయం ఏమిటనే అంశాలు తెరపైకి వస్తున్నాయి. యూజీసీ నిర్దేశించిన అర్హతలు యూనివర్సిటీల్లో అధ్యాపక నియామకాలకు కీలకమైనవి కాగా శాతవాహన యూనివర్సిటీలో సంబంధిత నియామకాలు ఏ నిబంధనల ప్రకారం చేపట్టారు? ఆ నిబంధనలకు అనుగుణంగా అభ్యర్థుల అర్హతలను పరిశీలించారా? అన్న అంశాలను యూనివర్సిటీ ఉన్నతాధికారులు వెల్లడించాల్సిన అవసరం ఉంది.
నాణ్యమైన బోధన అందుతోందా?
ఉన్నత విద్య కోసం యూనివర్సిటీలను ఆశ్రయించే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారుతుంది. అధ్యాపకుల నియామకాల్లో విద్యార్హతలు, బోధనా నైపుణ్యం, సంబంధిత అంశాల్లో పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తుండగా, అర్హతలపై సందేహాలు తలెత్తినప్పుడు వాటిని నివృత్తి చేయడం, నియామక ప్రక్రియపై స్పష్టత ఇవ్వడం యూనివర్సిటీ బాధ్యతగా భావించాలి.
ఇదే విషయమై సంబంధిత విభాగానికి చెందిన ప్రిన్సిపల్ వివరణ కోరగా అర్హతల విషయం తాను చూడనని, యూనివర్సిటీ ఉన్నతాధికారులు పంపిన అధ్యాపకులకు సంబంధించిన తరగతుల కేటాయింపు విషయం మాత్రమే తాను చూస్తానని వెల్లడించడం గమనార్హం. శాతవాహన యూనివర్సిటీ రిజిస్ట్రార్ మాట్లాడుతూ నిబంధనల మేరకు తీసుకోవచ్చు అని చెప్పడం కొసమెరుపు. ఇప్పటికైనా యూజీసీ తో పాటు యూనివర్సిటీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, అర్హత కలిగిన అధ్యాపకులను నియమించాలని, విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించడంలో ముందుండాలని విద్యార్థులు కోరుతున్నారు.
అవకాశం ఉంది..
కెమిస్ట్రీ విభాగానికి చెందిన ఉద్యోగి కేవలం పార్ట్ టైమ్ మాత్రమే.. నోటిఫికేషన్లో నెట్, స్లెట్, జిఆర్‌ఎఫ్ ఉండాలని నిబంధనలు ఉన్నా, యూజీసీలో ఉన్న కొన్ని నిబంధనల ప్రకారం తీసుకోవడం జరిగింది. కేవలం చెప్పిన తరగతులకు మాత్రమే వేతనం చెల్లించడం జరుగుతుంది. నెట్, స్లెట్, జిఆర్‌ఎఫ్ లేకున్నా ఒక పోస్ట్ కి ఒకే వ్యక్తి రావడంతో, యూజీసీ నిబంధనల ప్రకారం తీసుకోవచ్చు.
ఆచార్య పెద్దపల్లి సతీష్ కుమార్, రిజిస్ట్రార్, శాతవాహన యూనివర్సిటీ