నూతన విద్యా విధానపై అభిప్రాయ సేకరణ జరగాలి

24-11-2026 | 08:43pm
  1. తొందర పాటు నిర్ణయం మరింత నష్టం.
  2. సత్తుపల్లి ఎంఇఓ కు ట్రస్మా వినతిపత్రం అందజేత..

సత్తుపల్లి, నవంబర్ 24. ( విజయ క్రాంతి ): సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్(Secondary School Education) విధానాన్ని (9+4)ప్రవేశపెట్టాలనే  ప్రతిపాదనపై ప్రభుత్వం(Government) పునఃసమీక్ష చేయాలని  కోరుతూ ట్రస్మా  సత్తుపల్లి డివిజన్(TRSMA Sathupalli Division)  ఆధ్వర్యంలో ప్రైవేట్ పాఠశాలల వారు మంగళవారం   ఎంఈవో రాజేశ్వరరావుకు వినతిపత్రం  అందజేసింది.

తెలంగాణ రాష్ట్రంలో 10+2 విద్యా విధానంలో భాగంగా 9, 10, 11, 12 తరగతులను పాఠశాల విద్యలో విలీనం చేసి సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు  ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించారు.

వినతి పత్రంలో పేర్కొన్న విషయాలు

లక్షల మంది విద్యార్ధుల భవిష్యత్తును దృష్టి లో ఉంచుకొని దీనిపై తుది నిర్ణయం తీసుకునేముందు విద్యారంగ నిపుణులు, మేధావుల అభిప్రాయాలు తెలుసుకోవాలి. సమస్యలకు పరిష్కారం చూపకుండా కేవలం విద్యా విధానంలో మార్పులు చేయడం ద్వారా డ్రాపౌట్స్ సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుందని భావించడం సరికాదు.అంతేకాకుండా,

గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలు ఎనిమిదవ తరగతి వరకే పరిమితమైతే, తొమ్మిదవ తరగతి చదవడానికి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడి గ్రామీణ విద్యార్థుల్లో డ్రాపౌట్స్ మరింత పెరిగే ప్రమాదం ఉంది. అదేవిధంగా ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేయడం వల్ల ప్రస్తుత విద్యా సంస్థలు, వాటి నిర్వహణ మరియు విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం పడే అవకాశం ఉంది.

మా ప్రధాన విజ్ఞప్తులు

ప్రస్తుత విద్యా విధానాన్ని కొనసాగిస్తూ, ప్రతిపాదిత 10+2 విధానంపై క్షేత్రస్థాయిలో సమగ్ర అధ్యయనం నిర్వహించాలి. ప్రభుత్వం ఏదైనా కొత్త విద్యా విధానాన్ని చట్టబద్ధంగా అమలు చేయడానికి ముందు ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు, విద్యావేత్తలు, మేధావులు, విద్యారంగ నిపుణులు మరియు సంబంధిత వర్గాల అభిప్రాయాలను తప్పనిసరిగా సేకరించాలి.

కొత్త విద్యా విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన పక్షంలో ప్రస్తుత పాఠశాలల మనుగడకు మరియు నిర్వహణకు కనీసం 10 సంవత్సరాల మారిటోరియం (వెసులుబాటు కాలం) కల్పించాలి.గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు సమీపంలోనే పాఠశాలలు, ఇంటర్మీడియట్ విద్యాసంస్థలు మరియు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలి.

విద్యా సంస్కరణల్లో కేవలం మార్కులు, గ్రేడ్లు, పాస్ పర్సంటేజ్, ఉత్తీర్ణత శాతాల పెంపుపైనే కాకుండా నాణ్యమైన విద్య అందించడం, విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి మరియు విద్యా ప్రమాణాల మెరుగుదలపై దృష్టి పెట్టాలి.హడావుడిగా నిర్ణయాలు తీసుకోకుండా క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించి, అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలి.

మా అభిప్రాయం

మేము విద్యారంగంలో మార్పులను, సంస్కరణలను స్వాగతిస్తున్నాము. అయితే ఆ మార్పులు విద్యార్థులకు, తల్లిదండ్రులకు, విద్యాసంస్థలకు మరియు గ్రామీణ విద్యావ్యవస్థకు మేలు చేసే విధంగా ఉండాలి. పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్ విద్యను విలీనం చేయడం కంటే ముందుగా ప్రస్తుత విద్యావ్యవస్థలో ఉన్న సమస్యలను పరిష్కరించడం, మౌలిక సదుపాయాలను పెంపొందించడం మరియు నాణ్యమైన విద్యను అందించడం అత్యంత అవసరమని మా అభిప్రాయం.

కావున, పై అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని 10+2 విద్యా విధానంపై ప్రతిపాదనను పునఃసమీక్షించి, ప్రస్తుత విద్యా విధానాన్ని కొనసాగించడంతో పాటు, కొత్త విధానం అమలు చేయదలచిన పక్షంలో ప్రస్తుత పాఠశాలలకు కనీసం పది సంవత్సరాల వెసులుబాటు కల్పించేలా తగిన చర్యలు తీసుకోవాలని తమరి ద్వారా ప్రభుత్వాన్ని  కోరుతున్నాము.

మరిన్ని వార్తలు