సార్! జమలాపురం చెరువును సాగర్ నీటితో నింపండి!

27-09-2026 | 05:13pm

రైతుల సాగునీటి, త్రాగునీటి ఇబ్బందులను తొలగించండి

డిప్యూటీ సీఎం భట్టికి విన్నవించిన జమలాపురం సర్పంచ్ తుళ్ళూరు దంపతులు

ఎర్రుపాలెం సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): ఒకప్పుడు నీటితో కళకళలాడిన జమలాపురం పెద్దచెరువు(Jamalapuram Peddacheruvu) ఇప్పుడు నీరులేక విలవిల లాడుతుంది.. చెరువు ఎండిపోతే ఆ ప్రభావం బోర్లపైనా పడుతుందని, జమలాపురం గ్రామ ప్రజల నీటి అవసరాలకు చెరువును సాగర్ నీటితో నింపాలని ఆదివారం నాగులవంచలో పర్యటిస్తున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను(Deputy Chief Minister Bhatti Vikramarka) ప్రత్యేకంగా కలిసి జమలాపురం సర్పంచ్ తుళ్ళూరు నిర్మల కుమారి ,కోటేశ్వరరావు దంపతులు బట్టి విక్రమార్కకు విన్నవించారు.

జమలాపురం గ్రామంతో పాటు,రేమిడిచర్ల,కండ్రిక,తెల్లపాలెం,ఎర్రుపాలెం రైతులకు పొలాల్లో బోర్లు పునరుద్ధరణ జరిగి వ్యవసాయానికి సాగునీటికి ఇబ్బంది కలగకుండా ఉంటుందని తెలిపారు. ఆ గ్రామాల్లో పాడి పశువులకు,గొర్రెలు,మేకలు వంటి జీవాలకు కూడా త్రాగునీరు సమస్యలు తొలుగుతాయన్నారు.

ఈ మధ్య కాలంలో కురిసిన వర్షాలకు చెరువులో కుంటలు నిండాయని కానీ చెరువును సాగర్ జలాలతో పూర్తిగా నింపితే, గ్రామంలో సహజ నీటి వనరు పుష్కలంగా ఉంటుందని, ప్రజలకు నీటి అవసరాలు తీరుతాయన్నారు. సమస్యను విన్న డిప్యూటీ సీఎం ఇరిగేషన్ ఉన్నతాధికారులతో మాట్లాడారు.. వీలైనంత తొందరగా చెరువును నింపుతామని జమలాపురం గ్రామ సర్పంచ్ కు. భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రికి వారు కృతజ్ఞతలు తెలియజేశారు.

మరిన్ని వార్తలు