బాలికల విద్యపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: కలెక్టర్
ఆసిఫాబాద్ (విజయక్రాంతి): బాలికల విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కె. హరిత అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బేటీ బచావో బేటీ పడావో (Beti Bachao Beti Padhao) కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) యువరాజ్ మర్మాట్‌తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
బేటీ బచావో బేటీ పడావో పథకాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ సూచించారు. బాలికలను ప్రోత్సహించి ఉన్నత విద్య (Girls Education) అందించేలా చర్యలు తీసుకోవాలని, ఆడపిల్లలు దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. బడిమానేసిన బాలికలను గుర్తించి కౌన్సెలింగ్ (Counselling) ద్వారా తిరిగి పాఠశాలలకు తీసుకురావాలని సూచించారు. బాలికలకు నైపుణ్య శిక్షణలో భాగంగా బ్యూటీషియన్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ కోర్సులు నిర్వహించాలని తెలిపారు.
కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు, ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు, వసతి గృహాల్లోని బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, షాపింగ్ మాల్స్‌లో పనిచేసే మహిళా ఉద్యోగుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం-2013 ప్రకారం ప్రతి కార్యాలయంలో కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
బాలికలు, మహిళల హక్కులపై అవగాహన కల్పించాలని, బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. బాలల సహాయం కోసం 1098 హెల్ప్‌లైన్ అందుబాటులో ఉందని, ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. అనంతరం బాలికల రక్షణ చట్టాలకు సంబంధించిన గోడప్రతులను అధికారులతో కలిసి ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి స్వరూప, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి అంబాజీ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నాగేంద్ర, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి మహేష్, మహిళా సాధికారత సేవా కేంద్రం సమన్వయకర్త శారద, సిబ్బంది రాణి, మమత, శ్రావణి తదితరులు పాల్గొన్నారు