విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందించాలి
జిల్లా కలెక్టర్ కె.హరిత
ఆసిఫాబాద్ (విజయ క్రాంతి):ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య బోధన అందించాలని జిల్లా కలెక్టర్ కె.హరిత(District Collector K. Haritha) అన్నారు. సోమవారం తిర్యాని మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అదనపు గదుల నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టి త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు.
తరగతి గదులను సందర్శించి విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి వారి పఠనా సామర్థ్యాన్ని పరీక్షించారు. ఉపాధ్యాయులు సిలబస్ ను త్వరగా పూర్తి చేయాలని, విద్యార్థులకు అర్థమయ్యే విధంగా నాణ్యతతో కూడిన బోధన అందించాలని, విద్యార్థులు 100 శాతం హాజరు అయ్యేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలో గల మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం శిబిరాన్ని సందర్శించి నిర్వహణ తీరును పరిశీలించారు.
అధికారులు, డాటా ఎంట్రీ ఆపరేటర్లకు పలు సూచనలు చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని, రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా చేయించుకోవాలని, ఆ దిశగా గ్రామాలలో విస్తృత ప్రచారం చేపట్టాలని, టామ్ టామ్ నిర్వహించాలని తెలిపారు. అనంతరం కార్యాలయ సమావేశ మందిరంలో లింగాపూర్, తిర్యాని మండలాలలో అమలవుతున్న టి జి ఐ ఎల్ పి కార్యక్రమానికి సంబంధించిన శిక్షకులతో నిర్వహించిన సమీక్ష సమావేశానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ సమ్మిళిత జీవనోపాదుల కల్పనలో భాగంగా పథకం అమలు తీరు, లబ్ధిదారులకు అందుతున్న సహాయంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అర్హులైన నిరుపేదలను గుర్తించి, వారికి అవసరమైన ఆర్థిక చేయు తను అందించాలని, ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి నిరుపేద జీవనోపాధి మెరుగుపడేలా క్షేత్రస్థాయిలో కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారావు, మండల తహసిల్దార్ శ్రీనివాస్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి నగేష్, మండల విద్యాధికారి అంజయ్య, డి పి ఎం యశోద, ఎ పి ఎం లు శ్రీనివాస్, సూర్యకాంత్, వి బి జి రామ్ జి సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.