సీఈసీ జ్ఞానేశ్ రాజీనామా చేయాలి

29-09-2026 | 05:25am
  1. నెక్లెస్‌రోడ్‌లో  కాంగ్రెస్ నేతల నిరసన 
  2. రాష్ట్ర ఎన్నికల కార్యాలయం వరకు ర్యాలీ 
  3. సీఈసీకి వినతిపత్రం అందజేసిన పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు శ్రీధర్‌బాబు, అజారుద్దీన్ 
  4. బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తున్న సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ 
  5. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ ధ్వజం 
  6. రాహుల్ గాంధీ హెచ్చరించిన ఓట్ల చోరీ నిజమైంది
  7. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి) : కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్(Chief Election Commissioner of India)(సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా  డిమాండ్‌తో కాంగ్రెస్ పార్టీ(Congress Party) ఆందోళన చేపట్టింది. ఏఐసీసీ పిలుపు మేరకు సోమవారం  పీసీసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ నాయకులు , కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్‌లో ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. అక్కడి నుంచి ఎన్నికల సంఘం కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు.  సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఈ ధర్నాలో  టీపీసీసీ అధ్యక్షుడు  మహేశ్‌కుమార్ గౌడ్(TPCC President Mahesh Kumar Goud), మంత్రులు శ్రీధర్‌బాబు, అజారుద్దీన్, ఎంపీలు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్‌తో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు పెద్దఎత్తున  పాల్గొన్నారు. నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం వద్దకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావడంతో ఆ ప్రాంతం సందడిగా మారింది.  సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, ఎన్నికల ప్రక్రియ, ఓటర్ల జాబితా సవరణపై స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.

ఆ తర్వాత రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్‌రెడ్డికి పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, అజారుద్దీన్‌తో పాటు పార్టీ నేతలు వినతిపత్రం అందజేశారు. సీఈసీ రాజీనామా చేయాలని,  ‘సర్’లో లోపాలను సవరించి, అర్హులైన ఓటర్లకు అన్యాయం జరగకుండా చూడాలని  వినతిపత్రం అందజే శారు.  ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ, బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తున్న సీఈసీ జ్ఞానేశ్‌కుమార్  రాజీనామా చేయాలని  డిమాండ్ చేశారు.

ఎన్నికల సంఘం స్వతంత్ర వ్యవస్థలో పారదర్శకత ఉండాలని.. కానీ ప్రస్తుతం ఈసీ పక్షపాతంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. దేశ స్వాతంత్య్ర చరిత్రలో ఇంతటి హీనానికి పాల్పడిన సీఈసీ మరొకరు లేరని అన్నారు. పలు రాష్ట్రాల్లో సర్ పేరుతో  గెలవాల్సిన పార్టీ గెలవకుండా ఈసీ కుట్రలు చేసిందని ఆయన ఆరోపించారు. సర్ వల్లే బీహార్‌లో ఆర్జేడీ, పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ పార్టీలో  ఓటమి చెందాయని తెలిపారు. మీనాక్షీనటరాజన్ సీటు చోరీ కూడా చేశారని ఆయన మండిపడ్డారు. 

కొన్నేళ్లుగా దేశంలో ఓట్ల చోరీ, సీట్ల చోరీ జరుగుతోందని అన్నారు. మోదీ, అమిత్‌షాలకు ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదని, ఎప్పటికీ బీజేపీయే అధికారంలో ఉండాలని వారు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. నియంతలా వ్యవహరిస్తున్న ప్రధాని మోదీ, అమిత్ షాకు తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. కాంగ్రెస్ చేస్తున్న పోరాటానికి ప్రజాస్వామ్య శక్తులన్నీ కలిసిరావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.

దేశంలో గత కొన్నేళ్లుగా కుట్రపూరితంగా పౌరుల ఓటు హక్కును కాలరాస్తూ ’ఓట్ల చోరీ’ జరుగుతోందని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పదే పదే చేసిన హెచ్చరికలు నేడు నిజమని తేలిపోయాయని  భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఎస్‌ఐఆర్  పేరుతో పౌరుల ఓట్లను తొలగిస్తున్న తీరుపై ఇతర కమిషనర్లే స్వయంగా అంగీకరించడం దేశ ప్రజాస్వామ్యానికి పట్టిన దురదృష్టకర పరిణామమని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో రాజ్యాంగాన్ని, పౌరుల ఓటు హక్కును కాపాడటానికి రాహుల్ గాంధీ మొదటినుంచీ పోరాడుతున్నారని ప్రత్యేకంగా గుర్తుచేశారు.

ఓట్ల చోరీపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను నేడు స్వయంగా ఎన్నికల కమిషనర్లే ఒప్పుకోవాల్సి వచ్చిందని, ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువైన ఓటు హక్కునే కాలరాస్తే ఇక ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని విశ్వసించే రాజకీయ పార్టీలన్నీ విభేదాలను పక్కనపెట్టి కాంగ్రెస్‌తో  చేతులు కలపాలని, రాజ్యాంగంపై నమ్మకం లేని వారు మాత్రమే ఈ ఉద్యమానికి దూరంగా ఉంటున్నారని విమర్శించారు. భారత ప్రజాస్వామ్యంపై, పౌరుల హక్కులపై కాంగ్రెస్‌కు సంపూర్ణ విశ్వాసం ఉందని,  ప్రతీ పౌరుడికీ వారి ఓటు హక్కు దక్కేంత వరకు పోరాటాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు.

సర్ పేరిట 70ఏళ్ల ప్రజాస్వామ్య స్ఫూర్తిని కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అపహాస్యం చేస్తున్నారని భుమనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి  అన్నారు. బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ దేశవ్యాప్తంగా బడుగు బలహీన వర్గాల ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ, మిత్ర పక్షాలు ఇప్పటికే అనేక ఆధారాలను బహిర్గతం చేశాయని గుర్తుచేశారు. పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నా జ్ఞానేశ్వర్ కుమార్ రాజీనామా చేయడం లేదని ఆక్షేపించారు. ఇప్పటికైనా ఆయన తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

నెక్లెస్ రోడ్డులో ఇందిరాగాంధీ విగ్రహం వద్ద మంత్రులు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ర్యాలీని ప్రారంభించారు. సర్ ప్రభావం ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉండదని మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్‌అన్నారు. ఖైరతాబాద్ ఉపఎన్నికలో దిమ్మతిరిగే ఫలితం వస్తుందని చెప్పారు. ఉపఎన్నిక ఫలితం ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అవుతుందో అలా ఉంటుందని దానం పేర్కొన్నారు. ఈసీని అడ్డం పెట్టుకొని బీజేపీ ఓటు చోరీ చేస్తోందని, ఎంపీ ఎన్నికలో కిషన్‌రెడ్డి ఓటు చోరీతోనే గెలిచారని ఆరోపించారు. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్  వెంటనే  రాజీనామా చేయాలని ఆయన  డిమాండ్ చేశారు. సీఈసీ అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాలని కోరారు.

మరిన్ని వార్తలు