రామయ్య జన్మదినం.. తెలంగాణకు పర్వదినం: సీఎం
హైదరాబాద్: ప్రముఖ విద్యావేత్త, ఐఐటీ రామయ్య(IIT Ramaiah)గా సుపరిచితులైన చుక్కా రామయ్యకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 101వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఆయన నివాసానికి వెళ్లిన సీఎం.. రామయ్యను కలిసి ఆప్యాయంగా పలకరించారు. ఆయన సేవలను గుర్తుచేసుకుంటూ అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. చుక్కా రామయ్య జన్మదినం(Chukka Ramaiah Birthday) తెలంగాణ సమాజానికి, విద్యారంగానికి ప్రత్యేకమైన రోజని పేర్కొన్నారు. స్వాతంత్య్ర పోరాటం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు ఆయన చురుకైన పాత్ర పోషించారని కొనియాడారు. ఐఐటీ విద్యను సామాన్య విద్యార్థులకు చేరువ చేయడంలో రామయ్య కృషి మరువలేనిదన్నారు.
శాసనమండలి సభ్యుడిగా ప్రజా సమస్యలను ప్రస్తావించడమే కాకుండా, వాటి పరిష్కారానికి సూచనలు ఇచ్చేవారని సీఎం గుర్తుచేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో డిగ్రీ కళాశాలల అవసరాన్ని మండలిలో ప్రస్తావించి ప్రభుత్వ నిర్ణయానికి కారణమయ్యారని వివరించారు.
రామయ్య, ప్రొఫెసర్ నాగేశ్వర్ వంటి ప్రముఖులతో కలిసి పనిచేసిన అనుభవాన్ని సీఎం తన అదృష్టంగా అభివర్ణించారు. కాలానికి, రాజకీయాలకు అతీతంగా నిలిచే వ్యక్తిత్వం రామయ్యదని, ఆయన ఆలోచనలు, సూచనలను ప్రభుత్వం గౌరవిస్తోందని చెప్పారు. ఆయన ఆయురారోగ్యాలతో మరిన్ని తరాలకు స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి, ప్రొఫెసర్ హరగోపాల్, సీనియర్ జర్నలిస్టు రామచంద్రమూర్తి తదితరులు పాల్గొని రామయ్యకు శుభాకాంక్షలు తెలిపారు.