సిద్దాపూర్ రిజర్వాయర్ పనుల్లో వేగం పెంచాలి
ఎమ్మెల్యే పోచారం
బాన్సువాడ, నవంబర్ 20 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధికి కీలకమైన సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి(MLA Pocharam Srinivas Reddy) అధికారులకు, నిర్మాణ సంస్థ ప్రతినిధులకు సూచించారు.బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ని మండల పరిధిలో చేపడుతున్న సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులను(Siddapur Reservoir Works) శుక్రవారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా రిజర్వాయర్ నిర్మాణ పనుల ప్రస్తుత పురోగతిని కాంట్రాక్టర్ను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు పూర్తయిన పనులు, మిగిలి ఉన్న పనుల వివరాలను సమీక్షించారు. నిర్మాణ పనుల్లో వేగం పెంచి నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.రిజర్వాయర్ నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, పనుల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని స్పష్టం చేశారు.
నిర్మాణ నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణం పూర్తయితే పరిసర ప్రాంతాల ప్రజలకు, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి ప్రయోజనం చేకూరే అవకాశం ఉండటంతో పనులను సకాలంలో పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి సారించారు.
ఈ కార్యక్రమంలో వర్ని మండలాల నాయకులు, ప్రజాప్రతినిధులు, సిద్దాపూర్ పరిసర గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.