అండాల వెనుక భారీ నెట్‌వర్క్!

20-11-2026 | 05:41pm

హైదరాబాద్: నగరంలో వెలుగుచూసిన అండాల అక్రమ సేకరణ వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు (Police Investigation) ముమ్మరమైంది. ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించిన మలక్‌పేట పోలీసులు.. మరింత లోతుగా విచారించేందుకు ఇద్దరు నిందితులను ఐదు రోజుల కస్టడీ (Police Custody)కి ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు. సద్గురు హెల్త్ కేర్ బ్రాంచ్ ఇన్‌చార్జి ఆనంద్ రాజు, అడ్మిన్ షేక్ సుభానీని కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల విచారణలో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యవహారంలో మొత్తం 66 మంది మహిళలను గుర్తించగా.. వారిలో 47 మంది నుంచి అండాలు సేకరించినట్లు పోలీసులు నిర్ధారించారు. అక్రమంగా సేకరించిన అండాలను సంతానం లేని దంపతులకు విక్రయించినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది.

ఒక్కో అండాన్ని సుమారు రూ.3 లక్షల చొప్పున విక్రయించినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. సద్గురు హెల్త్ కేర్ డైరెక్టర్ గేదెల దుర్గారావు నేతృత్వంలో ఈ వ్యవహారం సాగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ అక్రమ దందాలో ఐదు ఏఆర్‌టీ (ART Centres) కేంద్రాలు పనిచేస్తున్నట్లు గుర్తించారు. అండాల సేకరణ, విక్రయాలకు సంబంధించిన కీలక రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న అమిత్, నిఖిత్, దుర్గాప్రసాద్‌పై మరో కేసు కూడా నమోదు చేశారు. కీలక నిందితులైన ఆనంద్ రాజు, షేక్ సుభానీని ఐదు రోజుల పాటు విచారించేందుకు పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు.

మహిళలను ఈ వ్యవహారంలోకి ఎలా తీసుకొచ్చారు? అండాల సేకరణ, విక్రయాల వెనుక ఎవరున్నారు? ఈ నెట్‌వర్క్‌లో ఇంకా ఎంతమంది భాగస్వాములుగా ఉన్నారు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు (Investigation) కొనసాగిస్తున్నారు. కస్టడీ విచారణలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు