విద్యార్థుల సృజనాత్మకతను వెలికి తీయాలి
రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
ముషీరాబాద్, నవంబర్20 (విజయక్రాంతి): విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, ప్రతిభను వెలికితీసేందుకు పెద్దలు ప్రోత్సాహం అందించాలని రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) అన్నారు. తెలంగాణ బాలోత్సవ కమిటీ(Telangana Balotsava Committee) ఆధ్వర్యంలో శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో(Sundarayya Vignana Kendram) నిర్వహించిన ఆరవ పిల్లల జాతర ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు సమాజం, చరిత్ర, శాస్త్రీయ ఆలోచనలు, దేశ సమైక్యత, సమగ్రతపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మత్తు పదార్థాల బారిన పడకుండా పిల్లలను కాపాడేందుకు ఇలాంటి సృజనాత్మక కార్యక్రమాలు నిరంతరం నిర్వహించాలని సూచించారు. బాలోత్సవ కమిటీ చేస్తున్న కృషిని అభినందిస్తూ ప్రభుత్వ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు కె.వి. రమణాచారి అధ్యక్షత వహించగా ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ మాట్లాడారు. కార్యక్రమంలో భాగంగా తెలంగాణ బాలోత్సవ జెండా, జాతీయ జెండాను ఆవిష్కరించి బాలోత్సవ గీతాన్ని ఆలపించారు. నృత్య గురువు ఇందిరా పరాశరం శిష్య బృందం100 మంది కళాకారులతో చేసిన నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది.
తొలిరోజు 8, 9, 10 తరగతుల విద్యార్థులకు పోటీలు నిర్వహించగా ఈ నెల 21న 1 నుంచి 7 తరగతుల విద్యార్థులకు పోటీలు నిర్వహించనున్నట్లు కమిటీ అధ్యక్షుడు భూపతి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి ఎన్. సోమయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కే. సుజావతి, శైలజ, మమత, రూప, రుక్మిణి, అంకమ్మ, పద్మ, మారయ్య, బ్రాహ్మణి, మహేష్, దుర్గే తదితరులు పాల్గొన్నారు.