లైంగిక దాడి కేసులో 20 ఏండ్ల జైలుశిక్ష
ఎల్బీనగర్, నవంబర్ 20 : యువతిపై లైంగిక దాడికి(Sexual assault on a young woman) పాల్పడిన కేసులో కోర్టు నిందితుడికి 20 ఏండ్ల జైలుశిక్ష విధించింది. మొదటగా బలాత్కారం చేసి, అనంతరం పెండ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి, మోసం చేసిన కేసులో యువకుడికి జైలుశిక్ష(Imprisonment), రూ,6100 జరిమానా విధిస్తూ బాధితురాలికి రూ, 3 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే.. కర్మన్ ఘాట్(Karmanghat) లోని శ్రీరాంనగర్ కాలనీలో పైడిపోగు రాజేశ్ (27) కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు.
ఇతడి ఇంట్లో అద్దెకు ఉంటున్న యువతి 28-07-2019న తెల్లవారుజామున సుమారు 03:30 గంటల ప్రాంతంలో కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్తుండగా, రాజేశ్ ఆమెను వెనుక నుంచి పట్టుకుని, నోరు మూసి బలవంతంగా తన గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయగా, నిందితుడిని ప్రశ్నించారు. ఆ సమయంలో నిందితుడు ఆమెను వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చినప్పటికీ, అనంతరం వివాహం చేసుకోవడానికి నిరాకరించాడు. దీంతో బాధితురాలు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని 31-07-2019న అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఎల్బీనగర్ లోని 13వ కోర్టు అదనపు జిల్లా న్యాయమూర్తి వాణి కేసు విచారణ పూర్తి చేసి గురువారం తీర్పు వెలువరించారు. నిందితుడిని దోషిగా నిర్ధారించి 20 ఏండ్ల జైలుశిక్షతో పాటు రూ.6,100 జరిమానా విధించింది. బాధితురాలికి రూ.3 లక్షల పరిహారం మంజూరు చేసింది. దర్యాప్తు అధికారి శ్రీనివాస్ రెడ్డి, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.మంజుల నిందితుడికి శిక్ష పడేలా కృషి చేశారు.