డ్రగ్స్‌పై యుద్ధం
- యువతను కాపాడితేనే దేశ భవిష్యత్తుకు భరోసా
- పునరావాస కేంద్రాలను 300 నుంచి 2 వేలకు పెంచుతాం
- డ్రగ్స్ తయారీదారులు, సరఫరాదారులపై కఠిన చర్యలు
- కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి
ముషీరాబాద్, నవంబర్ 24 (విజయక్రాంతి): ఉద్యమంలా నషా ముక్త్ భారత్(Drug-Free India) కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, డ్రగ్స్ రహిత భారత్ సాధన ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా 140 కోట్ల ప్రజల సామాజిక ఉద్యమంగా(Social movement) మారాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి(Kishan Reddy) పిలుపునిచ్చారు. దేశ యువత అతిపెద్ద ఆస్తి అని, వారిని మత్తు పదార్థాల మహమ్మారి నుంచి కాపాడుకుంటేనే దేశ భవిష్యత్తు సురక్షితంగా ఉంటుం దని అన్నారు. ‘హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్’ పాదయాత్ర సందర్భంగా మంగళవారం కవాడిగూడలోని సీజీవో టవర్స్‌లో నిర్వహించిన మీడియా సమావేశం లో ఆయన మాట్లాడారు.
ప్రధాని మోదీ(Prime Minister Modi) నేతృత్వంలో డ్రగ్స్ రహిత భారత్ కోసం కేంద్ర ప్రభుత్వం సమష్టి భాగస్వామ్యంతో కార్యాచరణ చేపడుతోందన్నారు. డ్రగ్స్ తయారీదారులను మొదటి లక్ష్యంగా, సరఫరాదారులను రెండో లక్ష్యంగా చేసుకుని కఠిన చర్యలు తీసుకుంటామని, మత్తు పదార్థాలకు బానిసైన యువత పట్ల మాత్రం సానుభూతితో వ్యవహరించి వారికి పునరావాసం కల్పించాలని సూచించారు. డ్రగ్స్ సరఫరా ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చేందుకు విదేశీ శక్తులు కుట్రలు చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
పంజాబ్‌లో డ్రగ్స్ సమస్య తీవ్రత దేశానికి హెచ్చరికగా నిలుస్తోందని, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ తదితర ప్రాంతాలకు కూడా ఈ సమస్య విస్తరిస్తోందని పేర్కొన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మీడియా, సామాజిక కార్యకర్తలు డ్రగ్స్ నిర్మూలనలో భాగస్వాములు కావాలని కోరారు. డ్రగ్స్‌కు బానిసైన యువతను నేరస్థులుగా చూడకుండా, వారిని ఆదరించి చికిత్స ద్వారా సాధారణ జీవితంలోకి తీసుకురావాలని సూచించారు.
పేద కుటుంబాల యువతకు ఉచిత చికిత్స అందించేందుకు దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న 300 పునరావాస కేంద్రాలను 2 వేలకు పెంచాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. 50 కోట్ల మంది యువతకు డ్రగ్స్‌పై అవగాహన కల్పించడంతో పాటు, తొలి దశలో లక్ష మంది ‘నషా ముక్త్ భారత్ మిత్ర’ వలంటీర్లను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. డ్రగ్స్ రవాణాను అరికట్టేందుకు బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, అస్సాం రైఫిల్స్ వంటి బలగాల్లో ప్రత్యేక విభాగాలు, జాగిలాలు, ఇంటెలిజెన్స్ వ్యవస్థలను బలోపేతం చేస్తున్నామని తెలిపారు.
యువత వ్యసనాలకు దూరంగా ఉండేందుకు ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా, యోగా కార్యక్రమాలను విస్తృతం చేయాలని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ భూములను విక్రయించకుండా కాపాడి, ప్రతి గ్రామంలో యువత కోసం క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలని కోరారు. పునరావాసం పొందిన యువతకు తిరిగి విద్య, ఉపాధి అవకాశాలు కల్పించి సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడిపేలా సహకరించాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఉమ్మడి కుటుంబాలు తగ్గడమూ కారణమే!
ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోవడం.. మత్తు పదార్థాల వినియోగానికి కారణమవుతోందని అభిప్రాయపడ్డారు. పట్టణాల్లో 25 శాతం యువత డ్రగ్స్‌కు బానిసగా మారాని ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాల స్థాయి నుంచే డ్రగ్స్ మహమ్మారిపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. భారత్‌లోకి డ్రగ్స్‌ను తెస్తున్న వారిని గుర్తించేందుకు దేశ సరిహద్దుల్లో జాగిలాల సంఖ్యను పెంచుతున్నామని చెప్పారు.
మూడు రోజుల పాదయాత్ర
డ్రగ్స్‌పై అవగాహన కల్పించేందుకు మొదటి దశలో మూడు రోజుల పాటు పాదయాత్ర చేస్తున్నట్టు కిషన్‌రెడ్డి వెల్లడించారు. ఈ నెల 25న ఉదయం అంబర్ పేట నుంచి పాదయాత్ర మొదలై 27న జూబ్లీహిల్స్ భారతీయ విద్యా భవన్ వద్ద ముగుస్తుందని అన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, బీజేపీ సీనియర్ నేత ప్రకాశ్‌రెడ్డి పాల్గొన్నారు.