దూసుకొస్తున్న అక్వాన్.. తెలంగాణకు వర్ష సూచన!
అక్వాన్ తుఫాన్ అలర్ట్.. శ్రీకాకుళంలో 16 సెం.మీ వర్షం, తెలంగాణలోనూ వానలు
అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అక్వాన్’ (Akvan) తీవ్ర తుఫాన్ తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తుండగా, తీర ప్రాంత ప్రజల్లో ఆందోళన నెలకొంది. తుఫాన్ బాహ్యవలయం ఇప్పటికే ఉత్తరాంధ్ర–దక్షిణ ఒడిశా తీరాలను తాకింది. శుక్రవారం ఉదయానికి ఒడిశాలోని గోపాల్పూర్ సమీపంలో పూర్తిస్థాయిలో తీరం దాటే అవకాశం ఉందని APSDMA ఎండీ, RTGS CEO ప్రఖర్ జైన్ వెల్లడించారు. గత ఆరు గంటల్లో గంటకు 21 కిలోమీటర్ల వేగంతో తుఫాన్ ముందుకు కదిలినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం కళింగపట్నానికి 110 కిలోమీటర్లు, విశాఖపట్నం, గోపాల్‌పూర్‌కు 170 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో ఇవాళ బలమైన ఈదురుగాలులతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
శ్రీకాకుళంలో భారీ వర్షాలు.. ఎక్కడెక్కడంటే?
అక్వాన్ ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలోని పలు మండలాల్లో ఇప్పటికే వర్షాలు దంచికొడుతున్నాయి. ఇచ్ఛాపురంలో అత్యధికంగా 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కంచిలి, కవిటిలో 10 సెంటీమీటర్లు, పలాసలో 9.9 సెంటీమీటర్లు, సోంపేటలో 9.2 సెంటీమీటర్లు, వజ్రపుకొత్తూరులో 4.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, కంచిలి, మందస, పలాస, వజ్రపుకొత్తూరు మండలాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. తుఫాన్ తీరం దాటే సమయంలో గాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.
తెలంగాణలోనూ వర్ష సూచన.. పెరుగుతున్న చలి
అక్వాన్ తుఫాన్ ప్రభావం తెలంగాణపైనా కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా తూర్పు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతోంది. తుఫాన్ ప్రభావంతో వర్షాలు, చలి కలిసి వాతావరణంలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.