తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు
జడ్చర్ల: జడ్చర్ల మున్సిపాలిటీ(Jadcherla Municipality) పరిధిలో రాబోయే వేసవి కాలంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ACLB మహబూబ్నగర్, జడ్చర్ల మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి మధుసూదన్ నాయక్, మున్సిపల్ కమిషనర్ ఎం. గిరీష్(Commissioner M. Gireesh)లు గంగాపూర్, కావేరమ్మపేట ప్రాంతాల్లో పర్యటించి తాగునీటి వసతుల పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా నీటి సంపుల పునరుద్ధరణ, నూతన బోర్ల ఏర్పాటు పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
కావేరమ్మపేటలో జరుగుతున్న నీటి సంపు పునరుద్ధరణ పనులను(Water sump restoration works) పరిశీలించి, ప్రజలకు మెరుగైన తాగునీటి సరఫరా అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే మిషన్ భగీరథ పైప్లైన్లలో ఏర్పడిన లీకేజీల మరమ్మతు పనులను పరిశీలించి,నీటి వృథాను అరికట్టి సరఫరాలో అంతరాయాలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి మధుసూదన్ నాయక్ మాట్లాడుతూ వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి మౌలిక వసతులను ముందుగానే బలోపేతం చేయాలని, చేపట్టిన పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా అందించాలని సూచించారు.మున్సిపల్ కమిషనర్ ఎం.గిరీష్ మాట్లాడుతూ తాగునీటి సమస్యలపై ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు తక్షణమే స్పందించాలని,పనులను నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు.ఈ పర్యటనలో మున్సిపల్ ఇంజనీర్ గాయత్రితో పాటు సంబంధిత మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.