ఓటుపై వేటేస్తే ఊరుకోం
- ‘సర్’పై సందేహాలకు సమాధానాలేవీ?
- తొలగించిన ప్రతి ఓటుకూ కారణం చెప్పాల్సిందే
- రాజ్యాంగ సంస్థలకు పారదర్శకతే ప్రాణం
- రాహుల్ పోరాటం ప్రజాస్వామ్య పరిరక్షణకు దిక్సూచి
- మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
హైదరాబాద్, నవంబర్ 3 (విజయక్రాంతి) : ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు(Right to vote) అత్యంత శక్తిమంతమైన ఆయుధమని, దానికి గండి కొట్టే చర్యలను సహించబోమని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి(Uttam Kumar Reddy) స్పష్టం చేశారు. ఓటరు జాబితాల ప్రక్షాళన పేరుతో అర్హులైన పౌరులను ప్రజాస్వామ్య ప్రక్రియకు దూరం చేస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. అర్హత కలిగిన ప్రతి పౌరుడి ఓటుకు రక్షణ కల్పించడం, ఎన్నికల వ్యవస్థపై(Electoral System) ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టడం రాజ్యాంగబద్ధ బాధ్యత అని పేర్కొన్నారు.
ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.‘సామాన్యుడి చే తిలో రాజ్యాంగం ఉంచిన అత్యంత శక్తిమంతమైన ఆయుధం ఓటు. పాలకులను ప్ర శ్నించే, మార్చే నిర్ణయాధికారం ప్రజలదే. అలాంటి ఓటు హక్కుతో చెలగాటమాడే అధికారం ఎవ్వరికీ లేదు’ అని తేల్చిచెప్పారు. అలాంటి హక్కుతో చెలగాటమాడితే ప్రజాస్వామ్య పునాదులే కదిలిపోతాయని మంత్రి హెచ్చరించారు. ఓటరు జాబితాలోని ప్రతి ఓటరు పేరు వెనుక ఒక పౌరుడి రాజకీయ అస్తిత్వం, ఆత్మగౌరవం, దేశ భవిష్యత్తును నిర్ణయించాలన్న ఆకాంక్షలు ఉన్నాయని, అన్యాయంగా తొలగిపోతే దానిని సాధారణ పరిపాలనా పొరపాటుగా తీసిపారేయలేమన్నారు.
‘తప్పు వ్యవస్థలో జరిగితే దాని భా రాన్ని పౌరుడి భుజాలపై మోపడం ఏమిటి? తన పేరు ఎందుకు తొలగిపోయిందో తెలుసుకోవడానికి ఓటరు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఎందుకు రావాలి?,హక్కు ను కాపాడాల్సిన వ్యవస్థే అడ్డంకిగా మారితే ప్రజలు ఎవరిని ఆశ్రయించాలి?’ అని ప్రశ్నించారు.
‘సర్’పై ఆరోపణలకు స్పష్టమైన సమాధానమివ్వాలని, తొలగించిన ప్రతి పేరుకు కారణం చెప్పాల్సిందేనని మంత్రి డిమాండ్ చేశారు. తొలగించబడిన ఓటరు తన వాదన వినిపించేందుకు అవకాశం కల్పించాలని, పొరపాటున తొలగించబడిన అర్హుల పేర్లను సత్వరం పునరుద్ధరించే సమర్థమైన వ్యవస్థ ఉండాలని పేర్కొన్నారు.
హక్కుల పరిరక్షణకే రాహుల్ పోరాటం
ప్రజల మౌలిక హక్కుల పరిరక్షణ కోసమే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ దేశవ్యాప్త పోరాట చేస్తూ బలమైన స్వరం వినిపిస్తున్నారని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. ఢిల్లీలో సుప్రీంకోర్టు దిశగా సాగిన పాదయాత్రలో రాహుల్‌తో పాటు మల్లికార్జున ఖర్గే, ప్రియాంకగాంధీ వాద్రా, అఖిలేశ్ యాదవ్, తేజస్వియాదవ్ తదితర ప్రతిపక్ష నేతలు, మద్దతుదారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ‘సర్’ ద్వారా అర్హులైన ఓటర్లకు జరుగుతున్న అన్యాయంపై గళమెత్తారని గుర్తు చేశారు.
లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ అధ్యక్షతన జరిగిన ‘ప్రజా అభిశంసన’ కార్యక్రమం ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనంపై డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాల ఉమ్మడి నిరసనను బలంగా వ్యక్తపరిచిందన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్‌పై ఆరు ఆరోపణలను పేర్కొంటూ మల్లికార్జున ఖర్గే ప్రవేశపెట్టిన తీర్మానానికి రాహుల్‌గాంధీతో పాటు కూటమి నేతలు మద్దతు తెలిపారని, ఢిల్లీలో రామ్‌లీలా మైదాన్ దిశగా సాగిన ప్రదర్శన, అనంతరం జరిగిన సభ.. ఓటు హక్కు పరిరక్షణపై ఉమ్మడి సంకల్పాన్ని చాటాయని మంత్రి స్పష్టం చేశారు.
విభిన్న రాజకీయ నేపథ్యాలు, ప్రాంతీయ ప్రాధాన్యాలు కలిగిన పార్టీలను సమీకరించడంలో రాహుల్ కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. ప్రశ్నలకు ఆధారాలతో సమాధానమివ్వడం, తప్పులు జరిగితే సరిదిద్దడం, పరిశీలనను స్వాగతించడం ద్వారా సంస్థలపై విశ్వాసం బలపడుతుందన్నారు.
ప్రజల సమస్యలను వినడం, వాటిపై నిలదీయడం, విభిన్న శక్తులను సమీకరించడం, రాజ్యాంగబద్ధ మార్గాల్లో పోరాడటం వంటి లక్షణాలు రాహుల్‌గాంధీ నాయకత్వ పటిమకు నిదర్శనమని పేర్కొన్నారు. భవిష్యత్తులో ప్రధానమంత్రిగా దేశానికి సమర్థ నాయకత్వాన్ని అందించగలరన్న తన విశ్వాసానికి ఈ పో రాటం మరింత బలం చేకూరుస్తుందన్నారు. అర్హులైన ఏ ఒక్క పౌరుడి హక్కుకు భంగం కలిగినా, దాని పరిరక్షణ కోసం నిలబడతామని, రాహుల్‌గాంధీ పోరాటానికి అండగా నిలుస్తామని మంత్రి స్పష్టం చేశారు.