జంతర్ మంతర్‌లో హైడ్రామా.. బొద్దింకల అరెస్ట్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ (Jantar Mantar) వద్ద మంగళవారం మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనుమతులు లేకుండా నిరసన తెలిపేందుకు ప్రయత్నించిన కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janata Party) నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిషేధిత ప్రాంతంలో నిరసనకు యత్నించడంతో ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం. మంగళవారం ఉదయం సీజేపీ నేతలు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్, అజింక్య షిండేతో పాటు పలువురు కార్యకర్తలు, వాలంటీర్లు జంతర్ మంతర్ నిరసన ప్రదేశంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ పరిణామంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది.
అనుమతులు లేకపోవడంతో పోలీసుల చర్యలు
నిరసనకు అనుమతులు లేకపోవడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందన్న కారణాలతో ఢిల్లీ పోలీసులు (Delhi Police) చర్యలు చేపట్టారు. అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌తో పాటు ఇతర సీజేపీ ప్రతినిధులను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశాల జాబితా నుంచి ఢిల్లీ పోలీసులు తొలగించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అక్కడ నిరసన చేపట్టేందుకు పార్టీ నేతలు ప్రయత్నించడం చర్చనీయాంశంగా మారింది