హైడ్రా బుల్డోజర్ ఎంట్రీ

07-10-2026 | 01:49pm

వరంగల్, అక్టోబర్ 7: వరంగల్‌లో మరోసారి పేదల ఇళ్ల కూల్చివేతల వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. భద్రకాళి ఆలయ సమీపంలోని చెరబండ రాజు కాలనీలో అధికారులు కూల్చివేతలు(Demolition) చేపట్టగా, భారీగా పోలీసు బలగాలను మోహరించారు. అధికారుల సమక్షంలో పేదల ఇళ్లను కూల్చివేస్తుండటంతో కాలనీవాసులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.ఇళ్ల కూల్చివేతను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో పోలీసులకు, కాలనీవాసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సీఐ కరుణాకర్‌తో మహిళలు వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. పోలీసుల తీరుపై కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కన్నీరుమున్నీరవుతున్న బాధితులు

తమ ఇళ్లు కూల్చివేస్తుండటంతో బాధితులు బోరున విలపించారు. ఏళ్లుగా నివాసం ఉంటున్న ఇళ్లను కూల్చివేస్తుండటంతో తమ పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఇళ్లను కూల్చివేయడాన్ని అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నించగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్లు స్థానికులు ఆరోపించారు. కూల్చివేతను అడ్డుకునే క్రమంలో ఓ మహిళ జేసీబీ(JCB)పై రాయి విసిరినట్లు స్థానికులు తెలిపారు. అనంతరం పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పలువురు బాధితులను మట్టెవాడ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు కాలనీవాసులు పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్‌ వద్ద కూడా బాధితులు ఆందోళనకు దిగారు.

ఎమ్మెల్యే నాయినిపై కాలనీవాసుల ఆరోపణలు

వరంగల్ వెస్ట్ నియోజకవర్గ పరిధిలో పేదల ఇళ్ల కూల్చివేతలపై కాలనీవాసులు తీవ్ర ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పేరును ప్రస్తావిస్తూ తమ ఇళ్ల విషయంలో అధికారులపై ఒత్తిడి(Pressure)పెంచుతున్నారని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే లేదా సంబంధిత అధికారుల వివరణ వెలువడాల్సి ఉంది. గతంలోనూ కూల్చివేతలను అడ్డుకున్న బాధితులపై దాడులు జరిగాయని కొందరు కాలనీవాసులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత కూల్చివేతలతో కాలనీలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

పోలీస్ స్టేషన్‌లోనూ ఆందోళన

ఇళ్లను కోల్పోతున్న బాధితులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్‌లో ఆందోళన నిర్వహించారు. తమ ఇళ్లను కూల్చివేయడం వల్ల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మా ఇల్లు కూల్చిన వాడు నాశనమైపోతాడు’’ అంటూ కొందరు బాధితులు తీవ్ర భావోద్వేగంతో మాట్లాడారు. కూల్చివేతల నేపథ్యంలో కాలనీలో పోలీసులు( Police) బందోబస్తు కొనసాగుతోంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. మరోవైపు తమ ఇళ్లకు రక్షణ కల్పించాలని, కూల్చివేతలను నిలిపివేయాలని బాధితులు అధికారులను కోరుతున్నారు. ఈ వ్యవహారంపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, బాధితులకు ప్రత్యామ్నాయంగా ఏదైనా ఏర్పాట్లు చేస్తారా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వార్తలు