ఆత్మహత్య చేసుకోబోయిన వ్యక్తిని కాపాడిన పోలీసులు

14-10-2026 | 10:30pm

మహబూబాబాద్ (విజయక్రాంతి): రాయుడు కిందపడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని మహబూబాబాద్(Mahabubabad) టౌన్ బ్లూ కోట్స్ పోలీసు సిబ్బంది ప్రాణాలకు తెగించి కాపాడారు. బైక్ కొనుగోలు విషయంలో తండ్రితో గొడవపడిన ఓ వ్యక్తి మనస్తాపానికి గురై రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, సకాలంలో స్పందించిన మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన బ్లూ కోట్స్ సిబ్బంది రహీమ్, సురేష్‌లు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రైల్వే ట్రాక్‌పైకి వెళ్లి అతడిని సురక్షితంగా కాపాడారు.

సీరోల్ మండలం తాళ్లసంకిస గ్రామానికి చెందిన ఒక వ్యక్తి బైక్ కొనుగోలు విషయంలో తండ్రితో జరిగిన గొడవ కారణంగా తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో మహబూబాబాద్ పట్టణానికి వచ్చి రైల్వే ట్రాక్‌పైకి వెళ్లినట్లు సమాచారం అందింది. వెంటనే స్పందించిన బ్లూ కోట్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, ప్రమాదకర పరిస్థితుల్లో రైల్వే ట్రాక్‌పై రిస్క్ తీసుకుని అతడిని పట్టుకుని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి ఒక విలువైన ప్రాణాన్ని కాపాడిన బ్లూ కోట్స్ సిబ్బంది రహీమ్, సురేష్‌లను మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతి రావు, టౌన్ ఇన్స్పెక్టర్ రఘుపతి రెడ్డి అభినందిచారు.

మరిన్ని వార్తలు