కోయిల్‌సాగర్ నీటి తరలింపుపై బీజేపీ అభ్యంతరం
స్థానిక రైతుల సాగునీటి హక్కులకు భంగం కలగకూడదు
బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కొండ ప్రశాంత్‌రెడ్డి
దేవరకద్ర: కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నుంచి కొడంగల్‌కు రోజుకు 4 కోట్ల లీటర్ల నీటిని తరలించే ప్రతిపాదనపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దేవరకద్ర బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కొండ ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రాజెక్టులో 2.276 టీఎంసీల పూర్తి నిల్వ సామర్థ్యానికి గాను 1.15 టీఎంసీల నీరు మాత్రమే ఉందని తెలిపారు. అసలు ఆయకట్టు 12 వేల ఎకరాలకే పూర్తిస్థాయిలో నీరందడం లేదని, ముందుగా స్థానిక రైతుల అవసరాలు తీర్చాలని డిమాండ్ చేశారు.
కోయిల్‌సాగర్ విస్తరణ ద్వారా 50,250 ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు. తాగునీరు, పారిశ్రామిక అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, అయితే స్థానిక రైతుల ప్రయోజనాలను దెబ్బతీయవద్దని కొండ ప్రశాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. నీటి కేటాయింపులు, అధికారిక అనుమతులు, నీటి లభ్యతపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర మండల అధ్యక్షుడు కృష్ణంరాజు, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు యజ్ఞభూపాల్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి నారాయణరెడ్డి, ఓబీసీ కార్యవర్గ సభ్యుడు దేవన్నసాగర్, కౌన్సిలర్ ఉమారాజ్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.