తిరుమలలో అరుదైన వేడుక
ఏడాదికి ఒక్కసారే ఉగ్రశ్రీనివాసమూర్తి దర్శనం.. ప్రత్యేకత ఇదే!
తిరుమల: తిరుమలలో మరో అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే భక్తులకు దర్శనమిచ్చే ఉగ్రశ్రీనివాసమూర్తి ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. కైశిక ద్వాదశి (Kaisika Dwadashi) పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించనున్నారు. సూర్యోదయానికి ముందే జరిగే ఈ వేడుకకు ఎంతో విశిష్టత ఉంది.
సూర్యకిరణాలు తాకకూడదనే ప్రత్యేక సంప్రదాయం!
తిరుమలలో వెంకటత్తురైవార్, స్నపనబేరం అని పిలిచే ఉగ్రశ్రీనివాసమూర్తికి సంబంధించి ఒక ప్రత్యేక సంప్రదాయం కొనసాగుతోంది. శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామివారిని ఆలయ మాడవీధుల్లో ఊరేగిస్తారు. అయితే సూర్యకిరణాలు స్వామివారి విగ్రహాన్ని తాకకుండా ఈ ఉత్సవాన్ని సూర్యోదయానికి ముందే పూర్తి చేస్తారు. స్థలపురాణం ప్రకారం.. పూర్వం ఉగ్రశ్రీనివాసమూర్తిని ఊరేగిస్తున్న సమయంలో స్వామివారిపై సూర్యకిరణాలు పడటంతో తిరుమలలో అనేక అశుభ పరిణామాలు చోటుచేసుకున్నాయని చెబుతారు. అప్పటి నుంచి స్వామివారి ఊరేగింపును సూర్యోదయానికి ముందే ముగించే సంప్రదాయం కొనసాగుతోంది. ఈ విశ్వాసమే ఈ ఉత్సవానికి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది.
తెల్లవారుజామునే అరుదైన దర్శనం..
క్షీరాబ్ధి ద్వాదశి రోజున వేకువజామున సుమారు 4.30 గంటలకు స్వామివారు ఆలయం వెలుపలకు వచ్చి మాడవీధుల్లో ఊరేగుతారు. తిరిగి ఉదయం 5.30 గంటలలోపు ఆలయంలోకి చేరుకుంటారు. ఈ సమయంలో ఉగ్రశ్రీనివాసమూర్తిని దర్శించుకునే అవకాశం భక్తులకు లభిస్తుంది. మరో విశేషం ఏమిటంటే.. భోగ శ్రీనివాసమూర్తి, ఉగ్రశ్రీనివాసమూర్తి, మూలవిరాట్టు, కొలువు శ్రీనివాసమూర్తి, శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి ఒకే పర్వదినాన సూర్యోదయానికి ముందుగా మాడవీధుల్లో దర్శనమివ్వడం విశేషం. ఏడాదిలో ఈ ఒక్క సందర్భంలోనే ఇలాంటి అరుదైన దర్శన భాగ్యం కలుగుతుంది.
ఆలయంలో కైశిక ద్వాదశి ఆస్థానం
స్వామివారి ఊరేగింపు ఆలయంలోకి చేరుకున్న అనంతరం అర్చకులు కైశిక ద్వాదశి ఆస్థానాన్ని వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా కైశిక ద్వాదశి పురాణ ప్రాశస్త్యాన్ని భక్తులకు వివరిస్తారు. ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ వేడుక తిరుమలలో భక్తులకు ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది.