కూతురిపై బన్నీ ప్రేమ

21-11-2026 | 02:26pm

బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట.. అభిమానుల్లో తిరుగులేని క్రేజ్.. ఇవన్నీ ఒకవైపు.. కుటుంబం దగ్గరకు వచ్చేసరికి అల్లు అర్జున్ పూర్తిగా మరో మనిషిగా మారిపోతారు. ముఖ్యంగా పిల్లలతో గడిపే ప్రతి క్షణాన్ని ఎంతో విలువైనదిగా భావించే ఐకాన్ స్టార్.. తాజాగా తన గారాలపట్టి అల్లు అర్హ పుట్టినరోజు (Birthday) సందర్భంగా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ అభిమానుల మనసులను తాకుతోంది.

అర్హతో కలిసి ఉన్న అందమైన మోనోక్రోమ్ ఫొటోను అల్లు అర్జున్ తన ఎక్స్ (X) ఖాతాలో షేర్ చేశారు. దీనికి ‘హ్యాపీ బర్త్‌డే టు ది జాయ్ ఆఫ్ మై లైఫ్’ అంటూ హృదయానికి హత్తుకునే క్యాప్షన్ జోడించారు. అంటే.. ‘నా జీవితంలోని ఆనందానికి కారణమైన నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని తన ప్రేమను అక్షరాల్లో వ్యక్తం చేశారు. ఈ చిన్న సందేశంలోనే కూతురిపై బన్నీకి ఉన్న అపారమైన అనురాగం కనిపిస్తోందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

మరోవైపు అర్హ పుట్టినరోజును కుటుంబ సభ్యుల మధ్య ప్రత్యేకంగా జరిపేందుకు అల్లు అర్జున్ శ్రీలంకకు వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ పర్యటనపై అధికారిక ప్రకటన వెలువడలేదు. 'శాకుంతలం' సినిమాతో బాలనటిగా వెండితెరకు పరిచయమైన అర్హకు ఆ చిత్ర నిర్మాణ సంస్థ గుణ హ్యాండ్‌మేడ్ ఫిల్మ్స్ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది. అభిమానులు సైతం సోషల్ మీడియాలో విషెస్ చెబుతున్నారు.

ఇదిలా ఉంటే, అల్లు అర్జున్ సినీ కెరీర్ (Film Career) ప్రస్తుతం ఆసక్తికర దశలో ఉంది. దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న భారీ ప్రాజెక్ట్ 'రాకా'పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా రియల్‌టైమ్ మోషన్ క్యాప్చర్ (Real-Time Motion Capture)కు సంబంధించి 37 మంది కళాకారుల భాగస్వామ్యంతో గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించడం విశేషం.

ఓవైపు భారీ ప్రాజెక్టులతో కెరీర్‌లో ముందుకు సాగుతున్న బన్నీ.. మరోవైపు కుటుంబానికి సమయం కేటాయిస్తూ తండ్రిగా తన ప్రేమను చాటుకుంటున్నారు. తెరపై ఎంతటి స్టార్ అయినా.. ఇంట్లో మాత్రం కూతురికి ప్రేమను పంచే ముద్దుల నాన్నే అని మరోసారి నిరూపించారు.

మరిన్ని వార్తలు