స్నేహ గ్రూప్‌పై ఐటీ రైడ్స్
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ వ్యాపార సంస్థ స్నేహ గ్రూప్‌పై ఆదాయపు పన్ను శాఖ అధికారులు (Income Tax Officials) మెరుపు దాడులు నిర్వహించారు. శనివారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని 16 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. హైదరాబాద్, విజయవాడతో పాటు పలు ప్రాంతాల్లో సంస్థ కార్యాలయాలు, కీలక డైరెక్టర్ల నివాసాల్లో అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఈ పరిణామం వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
హైదరాబాద్‌లోని కొండాపూర్ కేంద్రంగా పౌల్ట్రీ, అగ్రి బిజినెస్ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్నేహ గ్రూప్‌కు(Sneha Farms Income Tax Raids) చెందిన డైరెక్టర్లు రామ్‌రెడ్డి డెండి, వరుణ్ రెడ్డి డెండి, స్నేహ డెండి నివాసాల్లోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. సంస్థకు సంబంధించిన Financial Records, వ్యాపార లావాదేవీలు, ఆదాయ వివరాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సోదాలకు సంబంధించి పూర్తి కారణాలు, తనిఖీల్లో వెలుగుచూసిన అంశాలపై అధికారిక సమాచారం ఇంకా వెల్లడికావాల్సి ఉంది.
1982లో రామ్‌రెడ్డి చికెన్ మార్కెట్‌గా(Ramreddy Chicken Market) ప్రారంభమైన ఈ వ్యాపార సంస్థ.. 1994లో స్నేహ ఫామ్స్ పేరుతో విస్తరించింది. కాలక్రమేణా Poultry Farming, Chicken Processing, Cattle Feed తయారీ, వంట నూనెల ఉత్పత్తి వంటి రంగాల్లోకి అడుగుపెట్టింది. ముఖ్యంగా Safal బ్రాండ్ పేరుతో వంట నూనెలను మార్కెట్ చేస్తోంది. పౌల్ట్రీ రంగంలోనూ సంస్థ భారీ స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. తెలంగాణలో గంటకు 12,000 కోళ్లను ప్రాసెస్ చేసే సామర్థ్యం కలిగిన Automated Processing Plantను స్నేహ గ్రూప్ నిర్వహిస్తోంది. అంతేకాకుండా 2,000 మందికి పైగా Contract Farmersతో కలిసి వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఇంత విస్తృతమైన వ్యాపార కార్యకలాపాలు ఉన్న సంస్థపై ఐటీ శాఖ ఒకేసారి 16 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టడం ఆసక్తికరంగా మారింది. ఈ సోదాలు ముగిసిన తర్వాత అధికారులు వెల్లడించే వివరాలపై ఉత్కంఠ నెలకొంది.