ప్రజాప్రతినిధులు లేకుండానే ఉపాధి హామీ సోషల్ ఆడిట్ సభ

24-11-2026 | 09:42am

మొక్కుబడిగా ముగిసిన మండల సభ.. అధికారుల తీరుపై విమర్శలు

మిడ్జిల్: మండల కేంద్రంలోని ఎంపీడీవో సమావేశ మందిరంలో సోమవారం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(National Rural Employment Guarantee Scheme) పనులపై నిర్వహించిన సామాజిక తనిఖీ (సోషల్ ఆడిట్) మండల సభ ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యం లేకుండానే మొక్కుబడిగా ముగిసింది. 2025 నుంచి మార్చి వరకు పథకం కింద చేపట్టిన పనులపై జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అవకతవకలపై చర్చించాల్సిన కీలక సమావేశానికి ప్రజాప్రతినిధులు, ప్రజలు హాజరుకాకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

గ్రామాల వారీగా చేపట్టిన ఉపాధి హామీ పనుల(Employment guarantee works) వివరాలను సంబంధిత సిబ్బంది సభలో వెల్లడించినప్పటికీ, ఆయా పనుల్లో జరిగిన ఖర్చులు, అవకతవకల ఆరోపణలు, తనిఖీలో గుర్తించిన లోపాలపై స్పష్టమైన వివరాలు వెల్లడించకుండానే సభ ముగిసిందని స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, గ్రామస్తుల సమక్షంలో పారదర్శకంగా జరగాల్సిన సామాజిక తనిఖీ సభను ఇలా ఏకపక్షంగా నిర్వహించడం ఎంతవరకు సమంజసమని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఉపాధి హామీ పనులపై పూర్తిస్థాయి వివరాలు వెల్లడించి, అవకతవకలు జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ అదనపు పీడీ వామన్‌రావు, ఏపీడీ, ఎంపీడీవో లక్ష్మణ్, ఎంపీఓ రాజశేఖర్‌రెడ్డి, ఏపీవో హైమావతి, వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు