ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు
శివ నామస్మరణతో మారుమ్రోగిన శివాలయాలు
మంగపేట,(విజయక్రాంతి): కార్తీక పౌర్ణమి వేడుకల(Karthika Pournami Celebrations)ను ములుగు జిల్లా మంగపేట మండల వ్యాప్తంగా మంగళవారం ఘనంగా నిర్వహించుకున్నారు. మంగపేట మండల కేంద్రంలోని శ్రీ ఉమాచంద్రశేఖర స్వామి ఆలయం, మల్లూరులోని శ్రీ శంభులింగేశ్వర స్వామి ఆలయం, రాజుపేటలోని శ్రీ కొండలింగేశ్వరస్వామి ఆలయం, వాగొడ్డుగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని లక్ష్మినర్సాపురంలోని నాగులమ్మ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆయా ఆలయాలలో భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు.
అభిషేకాలు, కుంకుమార్చన పూజలు జరిపి, ఉసిరి చెట్టుకు మహిళలు పూజలు చేసి కార్తీక దీపాలు వెలిగించారు. శివాలయాలలో పూజలు చేసేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆయా ఆలయాలు కిక్కిరిసిపోయాయి. కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని భక్తులు అమ్మవారికి అభిషేకం, విశేష పూజలు చేశారు. భక్తులకు అర్చకులు తీర్థప్రసాదాలు అందించారు. శివనామస్మరణ చేస్తూ 365 వత్తులను భక్తులు వెలిగించారు. నాగులచవితినాడు పుట్టలో పాలు పోయని భక్తులు మంగళవారం పుట్ట వద్ద ప్రత్యేక పూజలు చేసి పుట్టలో పాలు పోశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయాలకు విచ్చేసిన భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేశారు.