గణేష్ మండప నిర్వాహకులకు పోలీసుల మార్గదర్శకాలు

10-09-2026 | 02:04pm

మహమ్మదాబాద్, సెప్టెంబర్ 10 విజయక్రాంతి: గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడంతో పాటు ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని మహబూబ్‌నగర్ జిల్లా పోలీసులు(Mahabubnagar District Police) గణేష్ మండప నిర్వాహకులకు సూచించారు. మహమ్మదాబాద్ మండల పరిధిలోని దేశాపల్లి చౌరస్తాలో గల పల్లవి ఆడిటోరియంలో నిర్వహించిన గణేష్ మండపాల అవగాహన కార్యక్రమానికి రూరల్ సీఐ గాంధీ నాయక్, మహమ్మదాబాద్ ఎస్‌ఐ శేఖర్ రెడ్డి(Mahammadabad SI Shekhar Reddy) ముఖ్య అతిథులుగా హాజరై పలు సూచనలు చేశారు. గణేష్ విగ్రహ ప్రతిష్ఠాపనకు సంబంధించిన వివరాలను పోలీస్ పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని తెలిపారు. రిజిస్ట్రేషన్ ద్వారా మండపాల వద్ద పోలీసు పెట్రోలింగ్‌తో పాటు నిమజ్జనం రోజున అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పారు.

మండపాలను ప్రజల రాకపోకలకు, ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేయాలని, విగ్రహం గద్దె కింద ఎలాంటి వస్తువులు నిల్వ చేయరాదన్నారు. మండపం, విగ్రహం భద్రత కోసం 24 గంటలూ కనీసం ముగ్గురు వాలంటీర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వాలంటీర్ల పేర్లను రిజిస్టర్‌లో నమోదు చేసి, ప్రతి ఒక్కరూ ఫోటో ఐడీ కలిగి ఉండాలని తెలిపారు. మండపాలను నాణ్యమైన వస్తువులతో నిర్మించాలని, విద్యుత్ కనెక్షన్ల విషయంలో భద్రతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. మండపాల వద్ద టపాకాయలు, ఇతర మందుగుండు సామగ్రి నిల్వ చేయరాదన్నారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎమర్జెన్సీ ల్యాంప్, నీటితో నింపిన డ్రమ్, ఇసుకతో నింపిన రెండు బకెట్లు అందుబాటులో ఉంచాలని చెప్పారు. క్యూ కోసం బ్యారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

స్థానిక డీఎస్పీ అనుమతి లేకుండా లౌడ్‌స్పీకర్లు వినియోగించరాదని, భక్తి గీతాలకు మాత్రమే వాటిని పరిమితం చేయాలని తెలిపారు. డీజేలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదన్నారు. మండపం వద్ద రెండు బాక్స్ టైప్ స్పీకర్లను మాత్రమే ఏర్పాటు చేయాలని, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు స్పీకర్లు వినియోగించరాదని సూచించారు. విద్యాలయాలు, ఆసుపత్రులు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు ఇబ్బంది కలిగేలా శబ్ద కాలుష్యం ఉండరాదన్నారు. విగ్రహాల తరలింపు సమయంలో విద్యుత్ తీగలు, హైటెన్షన్ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, TGSPDCL విద్యుత్ భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో స్థానిక పోలీసులకు, పోలీస్ కంట్రోల్ రూమ్ 8712659360 లేదా ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ 112కు సమాచారం అందించాలని కోరారు.

నిమజ్జన ఊరేగింపుపై సూచనలు

గణేష్ నిమజ్జనానికి అవసరమైన వాహనాలను నిర్వాహకులు ముందుగానే ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించారు. పోలీసుల సూచనల మేరకు వాహనాలు ముందుగానే బయలుదేరాలని, కేటాయించిన ప్రత్యేక నంబర్‌ను వాహనంపై స్పష్టంగా ప్రదర్శించాలని తెలిపారు. ఒక్కో విగ్రహానికి ఒక వాహనం మాత్రమే అనుమతించబడుతుందని చెప్పారు. నిమజ్జన వాహనాలపై లౌడ్‌స్పీకర్లు, డీజేలు ఏర్పాటు చేయరాదని, మద్యం లేదా ఇతర మత్తు పదార్థాల ప్రభావంలో ఉన్నవారిని ఊరేగింపులోకి అనుమతించరాదన్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించకుండా పోలీసుల సూచనలను పాటించాలని కోరారు. ఊరేగింపులో కర్రలు, కత్తులు, బాకులు, తుపాకులు, మండే పదార్థాలు లేదా ఇతర ప్రమాదకర వస్తువులు తీసుకెళ్లరాదని తెలిపారు. జెండాలు, అలంకరణలకు ఉపయోగించే కర్రలు రెండు అడుగులకు మించరాదన్నారు. బాటసారులపై కుంకుమ, గులాబ్ నీరు లేదా ఇతర పదార్థాలు చల్లరాదని సూచించారు. రాజకీయ, రెచ్చగొట్టే ప్రసంగాలు, నినాదాలు, బ్యానర్లు లేదా ఏ వర్గం మనోభావాలను దెబ్బతీసే చర్యలకు పాల్పడరాదని పోలీసులు హెచ్చరించారు. ఊరేగింపులో బాణాసంచా కాల్చరాదని స్పష్టం చేశారు. పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు ఇచ్చే సూచనలు, ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బందితో పాటు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన యువకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు