దళిత న్యాయవాదికి న్యాయం చేయండి
ఖానాపూర్(విజయక్రాంతి): దళిత న్యాయవాది కుటుంబం(Dalit lawyer family)పై వేధింపులు చేస్తున్న ఆర్మ్డ్ రిజర్వ్(ఏఆర్) కానిస్టేబుల్ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు(SC/ST atrocity case) నమోదు చేయాలని ఆలిండియా ఎస్సీ ఎస్టీ అడ్వకేట్ ఫోరం చైర్మన్, సుప్రీంకోర్టు అడ్వకేట్ వడ్లమూరి కృష్ణ స్వరూప్ డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల నిర్మల్ రూరల్ ప్రాంతంలోని విజయనగరం కాలానికి చెందిన జిల్లా కోర్టులో న్యాయవాద వృత్తి నిర్వహిస్తున్న ఆర్.రత్నరావు ఇంటి మీద, బోరుబావిపై దౌర్జన్యంగా నిర్మల్ మున్సిపల్ ఆఫీసర్లకు, పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేసి చేసినట్టు తెలిపారు. ఆ బోరు తీయించేసి బోరుబావిలో రాళ్లు మట్టి నింపారని ఆరోపించారు.
ఆధునిక కాలంలోనూ కులాల పేరిట వివక్ష, అణచివేతకు పాల్పడటం దారుణం అన్నారు. బాధిత కుటుంబం న్యాయం కోసం అడిగితే మున్సిపల్ అధికారులు, నిర్మల్ రూరల్ పోలీసులు(Nirmal Rural Police) స్పందించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కానిస్టేబుల్ శ్రీనివాస్, అతని కుటుంబ సభ్యుల మీద చర్యలు తీసుకోవాలని, న్యాయవాది రత్నం కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కులం పేరిట దూషించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీ, డిఎస్పిలకు ఫిర్యాదు చేశామన్నారు.
రెండుమూడు వారాలు గడుస్తున్న.. పోలీసుల నుంచి ఎటువంటి స్పందన లేదన్నారు. హైకోర్టులో పోలీస్, మున్సిపల్ యంత్రాంగాన్ని మేం ప్రాసీక్యూట్ చేయిస్తామని, ఎస్సీ ఎస్టీ అడ్వకేట్ ఫోరం తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ అడ్వకేట్ ఫోరం తెలంగాణ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి న్యాయవాది పి రాజలింగం, ఐ హెచ్ ఆర్ సి ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కాన్ఫిడరేషన్ ఐ ఎస్ ఆర్ సి తెలంగాణ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షురాలు ఎం. అర్చన, నిర్మల్ జిల్లా శాఖ అధ్యక్షులు కే వెంకటస్వామి , తదితరులు పాల్గొన్నారు.