నిజాం పాలనపై మహిళల వీరోచిత పోరాటం
తిరుమలాయపాలెం, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం(Telangana Peasant Armed Struggle)లో నిజాం పాలనకు వ్యతిరేకంగా మహిళలు వీరోచితంగా పోరాడారని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు. వీర తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా ఐద్వా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వీర వనితల స్ఫూర్తి యాత్ర మంగళవారం రాత్రి పిండిప్రోలుకు చేరుకుంది.
మహిళలు కోలాటాలతో యాత్రకు ఘన స్వాగతం పలికారు. దొండేటి సుగుణమ్మ అధ్యక్షతన జరిగిన సభలో మల్లు లక్ష్మి మాట్లాడుతూ భూమి, భుక్తి, వెట్టి చాకిరి విముక్తి కోసం సాగిన పోరాటంలో కమ్యూనిస్టుల పాత్ర మరువలేనిదన్నారు. సాయుధ పోరాటంలో నాలుగు వేల మంది అమరులయ్యారని, వేలాది గ్రామాలను విముక్తి చేసిన చరిత్ర ఉందన్నారు. ఈ పోరాటాన్ని హిందూ–ముస్లిం పోరాటంగా చిత్రీకరించడం సరికాదన్నారు. అనంతరం అమరవీరుల స్తూపాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఐద్వా, సీపీఎం నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.