అంగన్వాడీలకు రూ.18 వేల వేతనం ఇవ్వాలి
- పదవీ విరమణ తర్వాత రూ.10 వేల పెన్షన్ చెల్లించాలి
- ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి మేకల దాసు
మంచిర్యాల క్రైమ్, (విజయక్రాంతి): కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో(Congress election manifesto) ఇచ్చిన హామీ మేరకు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు నెలకు రూ.18 వేల వేతనం చెల్లించాలని, పదవీ విరమణ అనంతరం నెలకు రూ. 10 వేల పెన్షన్ ఇవ్వడంతోపాటు వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి మేకల దాసు డిమాండ్ చేశారు. అంగన్ వాడీ సిబ్బంది సమస్యలు తీర్చాలని కలెక్టరేట్ ముందు సోమ వారం ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ సిబ్బంది చిన్నారులకు పౌష్టికాహారం అందించడం, గర్భిణులు, బాలింతలకు సేవలందించడం, ప్రీ-స్కూల్ విద్యాబోధన, ఆరోగ్య కార్యక్రమాల అమలులో కీలక పాత్ర పోషిస్తున్నారని, అయినప్పటికీ తగిన వేతనాలు లేకపోవడం, బిల్లులు పెండింగ్‌లో ఉండటం, అదనపు విధుల భారం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
అంగన్వాడీ కేంద్రాల సేవలకు ఆటంకం కలగకుండా టీచర్లను బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్‌ఓ) విధుల నుంచి మినహాయించాలని డిమాండ్ చేశారు. సిబ్బందికి పీఎఫ్, ఆరోగ్య కార్డులు, రూ.25 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. అంగన్వాడీ కేంద్రాలకు నష్టం కలగకుండా ప్రీ-ప్రైమరీ పాఠశాలలను ఏర్పాటు చేయాలని సూచించారు.
కేంద్రాలకు సంబంధించిన పెండింగ్ బిల్లులు, సిబ్బందికి రావాల్సిన టీఏ, డీఏ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. ఐసీడీఎస్ పరిధిలో ఖాళీ పోస్టులను భర్తీ చేయడంతోపాటు పదవీ విరమణ చేసిన సిబ్బందికి ఆర్థిక ప్రయోజనాలు అందించాలని, 2023 సమ్మె సమయంలో నమోదైన కేసులను ఎత్తివేయాలని, అర్హత, సర్వీసు ఆధారంగా గ్రేడ్-2 సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అంగన్వాడీ సిబ్బందికి ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని, వారి సమస్యలు పరిష్కరించే వరకు ఏఐటీయూసీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు భూపతి రమాదేవి, తోకల సరస్వతి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎండీ అక్బర్ అలీ, వర్కింగ్ ప్రెసిడెంట్ కలిందర్ అలీ ఖాన్, కార్యదర్శి అఫ్రోజ్ ఖాన్, పి. సురేఖ, నేరేళ్ల అరుణ, కె. తిరుమల, ఇంద్ర, శంకరమ్మ, కుసుమ కుమారి, పద్మారెడ్డి, ఎ. అరుణ, సరోజ, బి. శైలజ, కనకలక్ష్మి, శారద, సంధ్య, జాడి కృప తదితరులు పాల్గొన్నారు.