ఆగని పశువుల అక్రమ రవాణా!

24-11-2026 | 05:35am

మహారాష్ట్ర నుంచి కోటపల్లి మండలం మీదుగా మూగజీవాల తరలింపు- 

ప్రతి రోజు 5 నుంచి 10 వాహనాల్లో తరలింపు- 

చెన్నూర్ వాసే ప్రధాన సూత్రధారిగా అనుమానాలు

కోటపల్లి, నవంబర్ 23 : మహారాష్ట్ర(Maharashtra) నుంచి పెద్ద ఎత్తున పశువులను తెలంగాణలోని కోటపల్లి మండలానికి(Kotapalli Mandal), ఇక్కడ నుంచి హైదరాబాద్(Hyderabad) లాంటి పట్టణాలతో పాటు ఇతర జిల్లాలకు తరలిస్తున్నారు. ఇదంతా చెన్నూర్(Chennur) పట్టణానికి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి ప్రస్తుత ప్రజాప్రతినిధులతో కలిసి అధికారులందరిని ‘మామూలు’గా కవర్ చేస్తూ నడిపిస్తున్నాడని పలువురు బాహాటంగానే పేర్కొంటున్నారు. మంచిర్యాల జిల్లా(Mancherial District) కోటపల్లి మండలం మీదుగా పశువుల అక్రమ రవాణా(Illegal transport of cattle) దందా జోరుగా సాగుతోందనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.

మహారాష్ట్ర సరిహద్దు సమీపంలో ఉండటాన్ని ఆసరాగా చేసుకొని కొందరు అక్రమ రవాణాదారులు మూగజీవులను తరలిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. రోజుకు సుమారు 5 నుంచి 10 వాహనాలలో పశువులను తరలిస్తున్నా సంబంధిత అధికారుల నిఘా ఎక్కడన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నది పరివాహక ప్రాంత గ్రామాల్లో కొందరు వ్యక్తులు డబ్బులకు ఆశపడి పశువుల తరలింపునకు సహకరిస్తున్నారనే సమాచారం కూడా చర్చనీయాంశంగా మారింది.

మూగజీవాల అక్రమ రవాణా ఇంత బహిరంగంగా సాగుతున్నా అడ్డుకట్ట వేసేవారు కరువయ్యారా..? రవాణాదారుల వెనుక ఉన్న అసలు సూత్రధారులెవరు..? స్థానికంగా సహకరిస్తున్న వారెవరు...? అనే ప్రశ్నలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా పోలీసులు, పశుసంవర్ధక శాఖ అధికారులు స్పందించి మండలంలోని ప్రధాన రహదారులు, నది పరివాహక ప్రాంతాలపై నిఘా పెంచి, పశువుల రవాణాకు సంబంధించిన వాహనాలను తనిఖీ చేయాలి. ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు