జర్నలిస్టుల పెన్షన్ కోసం ఎమ్మెల్యేకు వినతి
బెల్లంపల్లి (విజయక్రాంతి): ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్న జర్నలిస్టులకు పెన్షన్ (Pension), సంక్షేమ నిధి (Welfare Fund) ఏర్పాటు చేయాలని కోరుతూ బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌కు జర్నలిస్టులు వినతిపత్రం అందజేశారు. తమ ప్రతిపాదనను సీఎం రేవంత్‌రెడ్డితో పాటు సంబంధిత ప్రభుత్వ శాఖల దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు.
ఉద్యోగ విరమణ (Retirement) తర్వాత జర్నలిస్టులకు ప్రభుత్వం పెన్షన్ అందించి ఆదుకోవాలని కోరారు. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో జర్నలిస్టులు తమ గళం, కలంతో తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా నిలిచారని గుర్తుచేశారు. వివిధ పత్రికలు, టీవీ ఛానళ్లలో పనిచేస్తున్న జర్నలిస్టులు పదవీ విరమణ అనంతరం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వారికి ఆర్థిక భరోసా కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు జారీ చేసే ప్రకటనలతో పాటు అర్హత కలిగిన మీడియా ప్రకటనల ఆదాయంలో 10 శాతం మొత్తాన్ని జర్నలిస్టుల పెన్షన్, సంక్షేమ నిధికి కేటాయించేలా చట్టబద్ధమైన విధానం (Legal Framework) రూపొందించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు రాంశెట్టి వల్లభాయ్, ఆకుల శివప్రసాద్, పులియాల రాజు, పూదరి నగేష్ గౌడ్, వికాస్ యాదవ్, మోహన్, మనోజ్ పాండే, దండబోయిన భాస్కర్, ఇడిదివేని రాధాకృష్ణ, శ్రీనివాస్, బడుగు శ్రీనివాస్, అందుగుల రమేష్, రాజశేఖర్ పాల్గొన్నారు.