ఎస్ఐఆర్‌పై బీజేపీకి పొన్నం సూటి ప్రశ్నలు

24-11-2026 | 10:37am

హైదరాబాద్: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Special Integrated Revision) అంశంపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అర్హులైన ఓటర్ల పేర్ల తొలగింపు, ఎన్నికల డేటాలో మార్పులు, ఎన్నికల సంఘం స్వతంత్రతపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) లేవనెత్తుతున్న ప్రశ్నలకు బీజేపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో స్పందించారు.

ఓటర్ల జాబితా(Voter List) నుంచి అర్హులైన పౌరుల పేర్లు తొలగుతున్నాయన్న ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని పొన్నం కోరారు. అక్రమ చొరబాటుదారుల ఓట్లను కాపాడాలని తాము కోరడం లేదని, దేశంలోకి అక్రమంగా ప్రవేశించే వ్యక్తులు ఓటర్లుగా ఎలా నమోదవుతున్నారో కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) స్పష్టం చేయాలని ప్రశ్నించారు. కరీంనగర్‌(Karimnagar

)కు వచ్చి రాహుల్ గాంధీపై విమర్శలు చేయడం కంటే, గత 12 ఏళ్లలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అందించిన నిధులు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై బీజేపీ నేతలు వివరాలు వెల్లడించాలని సవాల్ విసిరారు. 

ప్రజాస్వామ్య సంస్థల స్వతంత్రత, రాజ్యాంగ పరిరక్షణ విషయంలో బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఆయన విమర్శించారు. మతపరమైన భావోద్వేగాలు, విద్వేష రాజకీయాలతో ప్రజలను ఎక్కువకాలం తప్పుదోవ పట్టించలేరని వ్యాఖ్యానించారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై పార్లమెంటులో ప్రత్యేక చర్చ చేపట్టాలని పొన్నం డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు