ఖానాపూర్‌లో వెలగని సెంట్రల్ లైటింగ్

24-11-2026 | 02:28pm

ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధి తీరుకు పట్టణంలోని ప్రస్తుత పరిస్థితులు అద్దం పడుతున్నాయి. మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత రెండో పాలకవర్గం కొలువుదీరినా అభివృద్ధి మాత్రం అంతంతమాత్రంగానే ఉందని స్థానికులు విమర్శిస్తున్నారు.

పట్టణంలో పందులు, కుక్కలు, కోతుల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా పాలకులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. మరోవైపు పట్టణ అభివృద్ధిలో కీలకమైన రోడ్ల వెడల్పు, సెంట్రల్ లైటింగ్ (Central Lighting) నిర్వహణ అధ్వానంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గత కొన్ని రోజులుగా సెంట్రల్ లైటింగ్‌లోని కొన్ని విద్యుత్ దీపాలు వెలగకపోవడంతో పట్టణంలోని పలు ప్రాంతాలు చీకటిమయంగా మారాయి. దీనికి తోడు లారీ అడ్డా ప్రాంతంలో సెంట్రల్ లైటింగ్ స్తంభానికి ఇరువైపులా ఉన్న వీధి దీపాలు ఊడిపోయి ప్రమాదకరంగా వేలాడుతున్నాయి. అవి ఎప్పుడు ఎవరి మీద పడతాయోనని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.

రోజుల తరబడి ఇదే పరిస్థితి కొనసాగుతున్నా మున్సిపల్ అధికారులు (Municipal Officials) పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రధాన రహదారిపై భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటున్నారు.

ఇప్పటికైనా మున్సిపల్ పాలకవర్గం స్పందించి పట్టణ అభివృద్ధిపై దృష్టి సారించడంతో పాటు ప్రజా సమస్యలను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు