అంతర్జాతీయ ఎమ్మీ వేదికపై విజయ్ సేతుపతి
భారతీయ సినీ పరిశ్రమకు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతి అంతర్జాతీయ ఎమ్మీ అవార్డుల (International Emmy Awards) వేదికపై ప్రత్యేక గుర్తింపు సాధించారు. న్యూయార్క్‌లో జరిగిన 54వ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డుల వేడుకలో ప్రజెంటర్‌గా (Presenter) పాల్గొని ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా నిలిచారు. న్యూయార్క్‌లోని హిల్టన్ మిడ్‌టౌన్‌లో నవంబర్ 23న ఈ ప్రతిష్ఠాత్మక వేడుక అట్టహాసంగా జరిగింది. ప్రపంచవ్యాప్తంగా సినీ, టెలివిజన్ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ వేడుకలో విజయ్ సేతుపతి ప్రజెంటర్‌గా వ్యవహరించడం భారతీయ అభిమానులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ ఏడాది అంతర్జాతీయ ఎమ్మీ అవార్డుల బరిలో భారత్ నుంచి కూడా పలు నామినేషన్లు (Nominations) వచ్చాయి. ప్రముఖ హాస్యనటుడు వీర్ దాస్‌తో పాటు రియల్ కాశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్‌కు సంబంధించిన కథనం కూడా నామినేషన్లు దక్కించుకుంది. అయితే భారత ప్రతినిధులకు ఈసారి అవార్డులు లభించలేదు. ఈ ఏడాది ఎమ్మీ అవార్డుల్లో యునైటెడ్ కింగ్డమ్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఏకంగా 9 అవార్డులను కైవసం చేసుకుని అగ్రస్థానంలో నిలిచింది. భారతీయ నటుడిగా విజయ్ సేతుపతి అంతర్జాతీయ వేదికపై ప్రజెంటర్‌గా పాల్గొనడం అరుదైన గుర్తింపుగా నిలిచింది. ఆయన సాధించిన ఈ ఘనతపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.