కార్తీక దీపం వివాదం.. బీజేపీ చీఫ్ హౌస్ అరెస్ట్

24-11-2026 | 01:29pm

చెన్నై: తమిళనాడులో కార్తీక దీపం ఉత్సవం(Kartik Deepam Festival) రాజకీయ వివాదానికి కేంద్రంగా మారింది. మదురైలోని తిరుప్పరన్‌కుండ్రం కొండ(Thiruparankundram Hill)పై దీపం వెలిగించే అంశం ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ నేపథ్యంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్‌(Tamil Nadu BJP Chief Nainar Nagendran)ను పోలీసులు మంగళవారం గృహనిర్బంధంలో ఉంచారు.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొండపై దీపం వెలిగిస్తున్నారా లేదా అన్నది పరిశీలించేందుకు నాగేంద్రన్ తిరుప్పరన్‌కుండ్రం వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆయన నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించి పర్యటనకు అడ్డుకట్ట వేశారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు, హిందూ మున్నాని సభ్యులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

కొండ చుట్టూ పోలీసుల పహారా

దీపోత్సవం నేపథ్యంలో మదురైలో భద్రతను కట్టుదిట్టం చేశారు. తిరుప్పరన్‌కుండ్రం పరిసరాల్లో సుమారు 5,000 మందికి పైగా పోలీసులను మోహరించారు. కొండ ప్రాంతాన్ని డ్రోన్ నో ఫ్లై జోన్‌గా ప్రకటించి, సీసీటీవీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. అనుమతి లేని ర్యాలీలు, సమావేశాలు, ప్రదర్శనలపై ఆంక్షలు విధించారు.

సుప్రీంకోర్టు ఆదేశాలతో వివాదం

నవంబర్ 20న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో సుప్రీంకోర్టు నవంబర్ 24న తిరుప్పరన్‌కుండ్రం కొండపై ఉన్న దీపస్తంభం వద్ద దీపం వెలిగించేందుకు అనుమతించింది. అయితే ఆలయ అధికారులు ఎంపిక చేసిన పరిమిత బృందం మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొనాలని స్పష్టం చేసింది. సాధారణ ప్రజలు, ఊరేగింపులు, నినాదాలకు అనుమతి లేదని పేర్కొంది. ఈ ఏర్పాటుతో భవిష్యత్తులో ఎలాంటి శాశ్వత సంప్రదాయ లేదా యాజమాన్య హక్కులు ఏర్పడవని కూడా స్పష్టం చేసింది.

మరోవైపు సుప్రీంకోర్టు(Supreme Court) ఆదేశాలను సమీక్షించాలని తమిళనాడు ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఈ పరిణామాల మధ్య దీపోత్సవం నిర్వహణపై ఉత్కంఠ కొనసాగుతోంది. బీజేపీ నేతల నిర్బంధంపై ఏఐఏడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, ఈ చర్యను ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అభివర్ణించారు.

మరిన్ని వార్తలు