నిరుపేద వివాహానికి ఆర్థిక సాయం
లక్షెట్టిపేట, నవంబర్ 14 (విజయక్రాంతి): ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు అండగా నిలవడమే నిజమైన సేవాభావమని చాటుతూ మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణానికి చెందిన లవ్లీ కిట్టి ఫ్యామిలీ (Lovely Kitty Family) సభ్యులు తమ ఉదారతను చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే.. లక్షెట్టిపేట మండలం చందారం గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం కోడిజుట్టు గంగ, శ్రీనివాసుల కుమార్తె శివాని వివాహానికి రూ.10 వేల ఆర్థిక సాయంతో పాటు నూతన చీరను (Financial Assistance) అందజేసి కుటుంబానికి అండగా నిలిచారు.
ఆడబిడ్డ వివాహం నిరుపేద కుటుంబానికి ఆర్థికంగా భారంగా మారుతున్న తరుణంలో లవ్లీ కిట్టి ఫ్యామిలీ సభ్యులు ముందుకు వచ్చి తమవంతు సహకారం అందించడం పట్ల గ్రామస్తులు, పలువురు హర్షం వ్యక్తం చేశారు. కష్టాల్లో ఉన్న కుటుంబానికి ఆపన్నహస్తం అందించిన సభ్యులకు కోడిజుట్టు గంగ, శ్రీనివాసుల కుటుంబ సభ్యులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. సేవా కార్యక్రమాలతో (Social Service) సమాజంలో మానవత్వపు విలువలను చాటుతున్న లవ్లీ కిట్టి ఫ్యామిలీ సభ్యులను పలువురు అభినందించారు.
ఈ కార్యక్రమంలో సభ్యులు చెట్ల రమేష్, మైలారపు సుధాకర్, వేణు, మోహన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.