రేవంత్, రాహుల్‌పై బండి సంజయ్ సెటైర్లు
హైదరాబాద్‌ను కామెడీ సర్కస్‌గా మార్చారు.. బండి సంచలనం!
హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్రమంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కార్మికుల హక్కులు, గిగ్ వర్కర్ల సంక్షేమం గురించి కాంగ్రెస్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌ను రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ కలిసి Comedy Circusగా మార్చేశారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టులో కాంగ్రెస్ తీరును ప్రశ్నించారు.
2014కు ముందు దేశంలో కొనసాగిన వలసవాద ఆలోచనా విధానాన్ని మార్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) ప్రభుత్వం కృషి చేసిందని బండి సంజయ్ పేర్కొన్నారు. గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్లను కేంద్ర కార్మిక చట్టాల్లో ప్రత్యేకంగా గుర్తించిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనని తెలిపారు. Code on Social Security, 2020 ద్వారా ఈ తరహా కార్మికులకు చట్టపరమైన గుర్తింపు కల్పించారని గుర్తుచేశారు. ఒకవైపు కార్పొరేట్ సంస్థలను విమర్శిస్తూ, మరోవైపు పెట్టుబడుల కోసం వాటిని ఆహ్వానించడం కాంగ్రెస్ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఆరోపించారు.
తెలంగాణలో గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఏం చేసిందని నిలదీశారు. ముఖ్యంగా Aarogyasri బకాయిల పరిస్థితి ఏమిటని, ఆసుపత్రులకు పెండింగ్ చెల్లింపులు ఎప్పుడు చేస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది, జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఆరోగ్య భద్రత సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారని అడిగారు.
ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వివిధ Welfare Boardsకు ఎంత నిధులు కేటాయించిందని, ఇప్పటివరకు ఎంత విడుదల చేసిందని బండి సంజయ్ ప్రశ్నించారు. కార్మికులకు రాజకీయ ప్రసంగాలు అవసరం లేదని, తమ జీవనోపాధి, సంక్షేమంపై స్పష్టమైన సమాధానాలు కావాలని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ స్క్రిప్ట్ ప్రసంగాలు చేసే ముందు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని తన పోస్టులో సవాల్ విసిరారు.