పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలి

19-10-2026 | 06:55pm

అదనపు కలెక్టర్ రాములు

మంచిర్యాల టౌన్: జిల్లాలో జిఓ నెంబర్ 59 కింద పెండింగ్‌లో ఉన్న 4,282 దరఖాస్తులతో పాటు జిఓ నెంబర్ 76 కింద పెండింగ్‌లో ఉన్న 727 దరఖాస్తుల పరిష్కారానికి సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా అదనపు కలెక్టర్ రాములు అన్నారు. సోమ వారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారుల సమన్వయంతో దరఖాస్తుల పరిశీలన, క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని సూచించారు.

జిఓ నెంబర్ 59కు సంబంధించిన దరఖాస్తుల పరిశీలన సమయంలో తహసిల్దార్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ), గ్రామ పంచాయతీ అధికారి (జిపిఓ) సంబంధిత రికార్డులతో క్షేత్రస్థాయికి వెళ్లాలని, 500 చదరపు గజాలలోపు విస్తీర్ణంలో ఉండి, నిర్మాణాలు ఉన్న స్థలాలకు సంబంధించిన నిబంధనలను అనుసరించి పరిశీలన చేపట్టాలని, సంబంధిత యజమానిని నిర్మాణంతో సహా ఫొటో తీసి, దరఖాస్తులోని నిర్దేశిత కాలంలో నమోదు చేసి ఆన్‌లైన్‌లో సమర్పించాలన్నారు.

ఈ ప్రక్రియలో ఏవైనా సందేహాలు ఉంటే ఆర్డీవో లేదా సబ్‌ కలెక్టర్‌ను సంప్రదించాలని సూచించారు. 22-ఏ జాబితాకు సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను వేగంగా పరిశీలించి, నిబంధనల ప్రకారం పరిష్కరించాలన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాల మేరకు ప్రజల సమస్యలు, ఫిర్యాదులను 9492123642 వాట్సాప్ నంబర్ ద్వారా స్వీకరించడం జరుగుతుందని, ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులకు పంపించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమానికి జిల్లా రెవెన్యూ అధికారి నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్నారని, వివిధ శాఖలకు అందిన ఫిర్యాదులను అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించి పరిష్కరించాలని సూచించారు. ఇన్‌చార్జి మంత్రి ఈ ఫిర్యాదుల పరిష్కారంపై సమీక్ష నిర్వహించే అవకాశం ఉన్నందున అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు.

మరిన్ని వార్తలు