ఫీజు కట్టకుంటే పిల్లలు బడి బయటనే

03-10-2026 | 06:24pm
  1. కోటపల్లి ఉషోదయ స్కూల్‌పై తల్లిదండ్రుల ఆగ్రహం
  2. విద్యపై లేని పట్టింపు ఫీజుల మీదనేనా?
  3. నిలదీస్తున్న తల్లిదండ్రులు

కోటపల్లి, ( విజయక్రాంతి ) : చదువు(Education) చెప్పాల్సిన పాఠశాలలో చిన్నారుల కన్నీళ్లు పెట్టించే పరిస్థితి నెలకొనడం ఆందోళన కలిగిస్తోంది. మంచిర్యాల జిల్లా(Mancherial District) కోటపల్లి మండలం బొగడగూడెంలోని ఉషోదయ స్కూల్‌(Ushodaya School)పై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఫీజుల విషయంలో ఒత్తిడి చేస్తూ తమ పిల్లలను పాఠశాల లోపలికి అనుమతించకుండా బయట నిలబెట్టారని పలువురు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

“పిల్లల భవిష్యత్తు కోసం బడికి పంపుతున్నాం.. ఫీజు కోసం పిల్లలను అవమానించేందుకు కాదు” అంటూ తల్లిదండ్రులు మండిపడుతున్నారు. చిన్నారులను భయపెట్టి, ఏడిపించి విద్యాబుద్ధులు నేర్పడం ఏ మేరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. పాఠశాల యాజమాన్యం ఫీజుల వసూళ్ల విషయంలో చూపుతున్న శ్రద్ధను విద్యార్థులకు అందించే విద్య, సౌకర్యాలు, మానసిక భద్రతపై కూడా చూపించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఫీజుల వసూళ్లలో కఠినత్వం.. సౌకర్యాల లేమి!

తమ పిల్లలను పాఠశాలలో చేర్పించే సమయంలో హామీలు ఇస్తున్న యాజమాన్యం, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాల విషయంలో మాత్రం తగిన స్థాయిలో దృష్టి పెట్టడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం(English Medium) పేరుతో నిర్వహిస్తున్న పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన బోధన అందుతోందా? అర్హత, అనుభవం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారా? అనే అంశాలపై అధికారులు సమగ్రంగా పరిశీలించాలని కోరుతున్నారు. పాఠశాలలో మౌలిక వసతులు, బోధనా ప్రమాణాలు, ఉపాధ్యాయుల అర్హతలు, ఫీజుల వసూలు విధానం తదితర అంశాలపై విద్యాశాఖ అధికారులు తనిఖీ చేయాల్సిన అవసరం ఉందని తల్లిదండ్రులు అంటున్నారు.

“ఫీజు విషయంలో సమస్య ఉంటే తల్లిదండ్రులను పిలిచి మాట్లాడాలి.. కానీ చిన్నారులను తరగతి గదిలోకి రానివ్వకుండా బయట నిలబెట్టడం ఎందుకు?” అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడి, అవమానం లేదా భయాందోళన కలగకుండా పాఠశాలలు వ్యవహరించాల్సిన బాధ్యత ఉందని వారు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై మంచిర్యాల జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి పాఠశాలను తనిఖీ చేయాలని, తల్లిదండ్రుల డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు