విద్యార్థులకు పౌష్టికాహారం కోసమే అల్పాహార లక్ష్యం..!
- బడుల్లో అల్పాహారం ప్రారంభం
- ఎమ్మెల్యే గడ్డం వినోద్
బెల్లంపల్లి: ప్రభుత్వ బడుల్లో(government schools) విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత కోసమే అల్పాహారం చేపట్టామని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్(Bellampalli MLA Gaddam Vinod) అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో తెలంగాణ అల్పాహార కార్యక్రమాన్ని(Telangana breakfast program)ఎమ్మెల్యే వినోద్, అదనపు కలెక్టర్ చంద్రయ్య తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న పేద విద్యార్థులు ఉదయం పూట ఆకలితో ఇబ్బందులు పడకుండా, పౌష్టికాహారం తీసుకుంటూ ఆరోగ్యంగా ఎదిగాలని, చదువులో రాణించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అల్పాహార కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు.
విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభివృద్ధి, ఉజ్వల భవిష్యత్తును ఆశిస్తున్నామని తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అనేకమంది తల్లిదండ్రులు ఉదయాన్నే తమ పనులకు వెళ్లే పరిస్థితుల్లో పాఠశాలలకు వచ్చే పిల్లలకు ఉదయం పూట అల్పాహారం ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.
విద్యార్థులు ఆకలిని మరిచి చదువుపై పూర్తి శ్రద్ధ పెట్టేలా, పౌష్టికాహారం ద్వారా ఆరోగ్యంగా ఉండేలా ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. విద్య ప్రతి విద్యార్థి జీవితాన్ని మార్చే గొప్ప ఆయుధమని, పేదరికం కారణంగా ఏ విద్యార్థి కూడా విద్యకు దూరం కాకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యాబోధనతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి, వారికి నాణ్యమైన విద్య అందేలా ప్రోత్సహించాలని కోరారు.
విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని, భవిష్యత్తులో తమ కుటుంబాలకు, బెల్లంపల్లి ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చంద్రయ్య, బెల్లంపల్లి ఎంఈఓ పోచయ్య, బెల్లంపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ దావ స్వాతి, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రత్నం సుకుమారి, స్థానిక కౌన్సిలర్ జంగం కల్పన, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండి ప్రభాకర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.