బతికున్నప్పుడు నిలువ నీడ లేదు.. చివరి మజిలీకి సొంత గడప లేదు!

20-09-2026 | 11:09pm

* నిరుపేద కుటుంబం దుస్థితికి అద్దం పట్టిన ఘటన

* ఇల్లు లేక.. స్మశాన వాటికలోనే రాత్రంతా మృతదేహం

* నిరాశ్రయ పేద కుటుంబాల దుస్థితిపై అధికారులు దృష్టి సారించాలని గుర్తుచేసే ఘటన

పాపన్నపేట, చిన్నశంకరంపేట,సెప్టెంబర్ 20: బతికున్నప్పుడు నిలువ నీడ లేదు.. చివరి మజిలీలోనూ సొంత గడప లేదు. ఇంటి కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన ఓ నిరుపేద మహిళకు, చివరికి తన మృతదేహాన్ని ఉంచేందుకు నాలుగు గోడలు లేకుండా పోయాయి. దీంతో ఆమె మృతదేహాన్ని రాత్రంతా స్మశాన వాటికలోనే ఉంచాల్సిన దయనీయ దుస్థితి నెలకొంది. మెదక్ జిల్లా(Medak District) చిన్న శంకరంపేట మండలం దరిపల్లి గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన మానవత్వాన్ని ప్రశ్నిస్తోంది.

దర్పల్లి గ్రామానికి చెందిన గంగిరెద్దుల లక్ష్మి(65) భర్త నర్సింలు 9 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. అప్పటి నుంచి లక్ష్మి తన కుమార్తె పూజతో కలిసి కూలీనాలీ చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. పూజకు ఇద్దరు సంతానం. కుటుంబ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా వీరికి సొంత ఇల్లు లేకపోవడంతో కనీస వసతి కూడా లేక ఇబ్బందులు పడుతున్నారు.

ఆసుపత్రి నుంచి స్మశాన వాటికకు..

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న లక్ష్మిని కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో శనివారం సాయంత్రం ఆమె మృతి చెందింది. అంబులెన్స్‌లో మృతదేహాన్ని దరిపల్లికి తీసుకొచ్చారు. అయితే మృతదేహాన్ని ఉంచేందుకు వారికి ఇల్లు లేకపోవడంతో కుటుంబ సభ్యులు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. చివరకు లక్ష్మి మృతదేహాన్ని స్మశాన వాటికకు తరలించి అక్కడే ఉంచాల్సిన దుస్థితి నెలకొంది.

మృతదేహంతో రాత్రంతా స్మశానవాటికలోనే..

సొంత గూడులో జరగాల్సిన చివరి మజిలీ ఊరవతల ఉన్న స్మశాన వాటికలోనే జరగాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది. రాత్రంతా మృతదేహాన్ని స్మశాన వాటికలోనే ఉంచిన కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. ఆదివారం అదే స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.

ఓ మనిషి జీవితానికి చివరి చిరునామా కూడా సొంత గడప కాకపోవడం ఎంతటి దయనీయ పరిస్థితి..! సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లోనూ పేదరికంతో పోరాడుతున్న కుటుంబానికి కనీసం ఓ ఇల్లు లేకపోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. జీవితాంతం కష్టాలతో పోరాడిన లక్ష్మికి.. చివరి వీడ్కోలుకూ సొంత గడప కరువైంది. ఈ ఘటన నిరాశ్రయ పేద కుటుంబాల పరిస్థితిపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తోంది.

మరిన్ని వార్తలు