డబుల్ బెడ్ రూంలలో పోలీసుల కార్డన్ సెర్చ్

04-11-2026 | 12:25pm

450 కు పైగా ఇళ్లలో క్షుణ్ణంగా తనిఖీలు

పత్రాలు లేని 64 వాహనాలు స్వాధీనం

నార్కోటిక్ డాగ్‌తో మాదకద్రవ్యాల కోసం తనిఖీలు

ఫింగర్‌ ప్రింట్ డివైజ్‌తో పాత నేరస్థుల గుర్తింపు

ప్రజలకు ఇబ్బంది కలిగించడం మా ఉద్దేశం కాదు

జిల్లాలో అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్

తూప్రాన్,(విజయ క్రాంతి): నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా తూప్రాన్ పట్టణంలోని 2బీహెచ్‌కే కాలనీలో బుధవారం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్(Community Contact Program) నిర్వహించినట్లు మెదక్ జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఐపీఎస్(Additional SP Vikrant Kumar Singh, IPS) తెలిపారు. ఈ తనిఖీల్లో సుమారు 105 మంది పోలీసు సిబ్బంది పాల్గొని 450కు పైగా ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో  సరైన పత్రాలు లేని 61 ద్విచక్ర వాహనాలు, మూడు త్రిచక్ర వాహనాలు కలిపి మొత్తం 64 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

తనిఖీల్లో భాగంగా నార్కోటిక్ డాగ్ జూబి సహాయంతో ఇళ్లలో, పరిసర ప్రాంతాల్లో మాదకద్రవ్యాల ఉనికిని గుర్తించేందుకు తనిఖీలు నిర్వహించారు. ఫింగర్‌ ప్రింట్ డివైజ్ ద్వారా వ్యక్తుల వేలిముద్రలను పరిశీలించి గతంలో నేరాలకు పాల్పడిన పాత నేరస్థుల వివరాలను గుర్తించే ప్రక్రియ చేపట్టినట్లు అదనపు ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ.. తూప్రాన్ పట్టణంలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు నివసిస్తూ తమ తమ పనుల్లో నిమగ్నమై ఉంటారని తెలిపారు.

అయితే కొంతమంది వ్యక్తుల వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగించే వ్యక్తులను గుర్తించి అరికట్టడమే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం సాధారణ ప్రజలను ఇబ్బందులకు గురిచేయడానికి కాదని, వారి భద్రతకు భరోసా కల్పించడానికేనని పేర్కొన్నారు.

కాలనీల్లో నివసించే వారి వివరాలు, పూర్వాపరాలను పరిశీలిస్తూ అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రజలు తమ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా అసాంఘిక కార్యకలాపాలను గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రజల సహకారంతో నేరరహిత సమాజ నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, ఇన్‌స్పెక్టర్ వెంకటరాజ్ గౌడ్, నర్సాపూర్ సీఐ రంగకృష్ణ, ఎస్ఐలు, పోలీసు సిబ్బందితో పాటు సీసీఎస్, షీ టీమ్స్, డాగ్ స్క్వాడ్ బృందాలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు